దుబ్బాక ఉప ఎన్నిక హడావుడి ముగియడంతో ఇక గ్రేటర్‌పై బీజేపీ దృష్టి పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లోనే బీజేపీ ముఖ్యనేతల ఉన్నా ఇప్పటి వరకు ఇక్కడ చెప్పుకో తగ్గ ఫలితాలు రాబట్టుకోలేక పోయింది. గతంలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ఆ స్థాయిలో కార్పోరేటర్లను గెలిపించుకోలేక పోయారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటుకే పరిమితం అయ్యింది. ముఖ్య నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డిలు సైతం ఓటమి పాలయ్యారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో కిషన్ రెడ్డి గెలిచి తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. దీంతో ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. గ్రేటర్ ఎన్నికలకు గడవు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ పూర్వ వైభవం తెచ్చుకోవాలని భావిస్తోంది.
క్షేత్ర స్థాయిలో కేడర్‌ను యాక్టివ్ చేస్తున్న సంజయ్..
గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టు సాధించేందుకు ఇప్పటికే నలుగురు అధ్యక్షుల ప్లాన్ అప్లై చేసింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వడంతో హైదరాబాద్‌లోనూ ఇదే తరహాలో పార్టీ స్కెచ్ వేసింది. అయితే, ఇప్పటి వరకు గ్రేటర్ కొత్త అధ్యక్షులు పెద్దగా గ్రౌండ్ వర్క్ చేయడం లేదని కిందిస్థాయిలో కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వరద సాయం పేరుతో రూ.10 వేలు పంచుతుంటే మనం కనీసం గ్రౌండ్‌లో కూడా లేక పోతే ఎలా అన్న ఆగ్రహం వారిలో వ్యక్తమవుతోంది. దీంతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నారు. అధ్యక్షులు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలంటూ ఆదేశించారు. వరద సాయం విషయంలో ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. దీంతో పాటు గత ఐదేళ్ళలో గ్రేటర్‌లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఎలా మరచి పోయిందో ప్రజలకు వివరిస్తూ .. బీజేపీకి ఓటేయడం ద్వారా కలిగే లాభాలను వివరించాలని భావిస్తున్నారు.
ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించిన బీజేపీ..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వారు దరఖాస్తు చేసుకునేందుకు బీజేపీ అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న వారంతా తమ దరఖాస్తులు బీజేపీ కార్యాలయాల్లో ఇవ్వాలంటూ సూచించింది. ఈ వ్యవహారాన్ని పూర్తిగా జిల్లా అధ్యక్షులకే వదిలేశారు. ఆ ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో బీజేపీ నుండి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి అలసత్వం లేకుండా గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చేలా చూడాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. జిల్లా అధ్యక్షులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర నాయకులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో కచ్చితంగా కాషాయం జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని … గతంలో లా మెద్దు నిద్రలో ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్ వరద సాయంతో ఎన్నికలకు పోతుంటే .. బీజేపీ మొదటి మెట్టు నుంచి తన ప్రయాణం ప్రారంభించాలని చూస్తోంది. ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.