బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ చాలాకాలం గ్యాప్ తర్వాత ‘లూడో’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. వరుస పరాజయాలతో సతమతమువుతున్న అభిషేక్ ‘హౌస్ ఫుల్ – 3’ సినిమాతో హిట్ కొట్టినా, ‘మనమర్జియా’ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టినా అవేమి ఆయన సినీ కెరియర్ ముందుకు వెళ్లడంలో సహాయపడలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మల్టీస్టారర్ సినిమాలను కూడా చేశాడు అభిషేక్ బచ్చన్. అయినా ఆయనకు సాలిడ్ హిట్ పడలేదనే చెప్పాలి.
అయితే ఈ నెల 12వ తేదీన రిలీజ్ అయిన ‘లూడో’ సినిమా ద్వారా అభిషేక్ ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు. ‘లూడో’ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహించగా ఆదిత్యరాయ్ కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, ఫాతిమా సనాషేక్లు ఇందుల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ‘లూడో’ సినిమా ప్రేక్షకులకు నచ్చడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడు అనురాగ్ బసు ఇందులోని పాత్రలను లూడో గేమ్ తరహాలో మలిచిన తీరు అందరిని ఆకట్టుకుంది.
ఈ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న అభిషేక్ బచ్చన్ తను నటించిన తదుపరి సినిమా ‘ది బిగ్ బుల్’ను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. స్టాక్ మార్కెట్ లో జరిగిన కుంభకోణంపై ‘ది బిగ్ బుల్’ సినిమా ఉండబోతుంది. ఇందులోని అభిషేక్ చేసిన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాను కూడా నెట్ ఫ్లిక్స్ ద్వారానే రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. ‘ది బిగ్ బుల్’ సినిమా కూడా తప్పకుండా హిట్ సాధిస్తుందని అభిషేక్ బచ్చన్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ది బిగ్ బుల్’ సినిమా కూడా మంచి విజయం సాధించి తన అభిమానులను ఛోటా బచ్చన్ సంతోష పెడతాడో లేదో చూడాలి మరి.
Must Read ;- ఊర్మిళ పోర్న్ స్టార్ అని నోరు జారిన కంగన రనౌత్










