గ్రేటర్ హైదరాబాద్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ దూకుడుగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌ను గ్రాండ్‌గా ప్రారంభించిన ఆ పార్టీ గ్రేటర్‌లో కొంతమంది కీలక నేతలను తమ వైపు తిప్పుకుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానాలు పలుకుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నేతలు మాజీ మేయర్ బండ కార్తిక , మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్‌లను తమ వైపు తిప్పుకుంది . మరికొంత మంది నేతలను పార్టీలో చేర్చుకోవడం కోసం జోరుగా చర్చలు జరుపుతోంది. పార్టీలో చేర్చుకునేందుకు ముఖ్యనేతలు ఎవరికి వారు బాధ్యత తీసుకున్నారు. తమకు తెలసిన వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఏ మేరకు సాధిస్తుందో చూసి దాన్ని బట్టి పార్టీలో చేరేందుకు చాలా మంది వేచి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరువాత అనేక చేరికలు ఉంటాయని భావించినా పెద్దగా జరగలేదు. తాజాగా గ్రేటర్ ఎన్నికల తరువాత పార్టీ 2023 టార్గెట్‌గా భారీ స్థాయిలో చేరికలను ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది.
పార్టీలో చేరేవారికి కోసం..
ఇతర పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్న నేతలు తమ పార్టీలో చేరేందుకు వస్తుంటే బీజేపీ నేతలు కాదనడం లేదు. ఎవరు ఎప్పుడు తమను సంప్రదించాలనుకున్నా తమ తలుపులు ఓపెన్ చేసే ఉంటాయంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇందుకోసం రాత్రీ పగలు తేడా లేకుండా ఎవరెవరిని పార్టీలో చేర్చుకోవాలన్న దానిపై చర్చలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటగా ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను లాగేందుకు బీజేపీ ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తరువాత పార్టీ వేగం పెరిగింది. టీఆర్ఎస్ పార్టీపై ఎదురుదాడిని తీవ్రం చేసింది. టీఆర్ఎస్ పార్టీకి మాటకు మాట సమాధానం చెబుతూ ఆ పార్టీని డిఫెన్స్‌లో పడేస్తోంది. రైతు సమస్యలైనా, నిరుద్యోగ సమస్యలైనా, వరద సమయంలోనూ ఆ పార్టీ టీఆర్ఎస్‌ని బ్లేమ్ చేస్తూ ప్రజల్లో మార్కులు కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ప్రజల్లో బీజేపీకి క్రేజ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అర్ధరాత్రి కూడ మంతనాలు..
ఇతర పార్టీల అసంతృప్త నేతలు తమ వద్దకే రావాలన్న ఆలోచన లేకుండా బీజేపీ నాయకులు ఏ సమయంలో ఎవరు సంప్రదించినా వారి వద్దకే వెళ్ళి చర్చలు సాగిస్తున్నారు. గత మూడు రోజులుగా అర్ధరాత్రి కూడ రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు పలువురు ఇతర పార్టీల నేతలతో వారి ఇంటికే వెళ్ళి చర్చించినట్టు తెలుస్తోంది. రాత్రి రెండు గంటలకు కూడా వెళ్ళి పరిస్థితులు చక్కబెట్టే పనిలో పడ్డారు బీజేపీ నేతలు. పార్టీ బలోపేతానికి ఇతర పార్టీల నేతలను కలిసి వారికి కావాల్సిన అన్ని అవకాశాలు ఇస్తామని చెబుతున్నారు. అవసరం అయితే జాతీయ నాయకులతో నేరుగా ఆ నేతలను మాట్లాడిస్తూ కన్వెన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా వేస్తున్న అడుగులు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Must Read ;- సొంత గూటిలో శత్రువు.. రేవంత్‌కు టచ్‌లో బీజేపీ నేత?