సినీ ఇండస్ట్రిలో ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సౌత్ , నార్త్ ఇండస్ట్రిలలో నటీనటుల ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువగా చూస్తున్నాం. గత కొద్ది కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న బాలేవుడ్ స్టార్స్ అలియా భట్ , రణ్‌బీర్ కపూర్ లు ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్ళి బంధంతో ఒకటై బాలీవుడ్ క్రేజీ కపుల్ గా పేరొందారు. పెళ్ళయిన రెండు నెలలకే ఈ జంట తాము తల్లిదండ్రులు కాబోతున్నారు.ఈ విషయాన్ని ఆలియా స్వయంగా సోషల్ మీడియా వేదికగా జూన్ 27న ప్రకటించింది.
ఆలియా, రణ్ బీర్ లు తల్లిదండ్రులు కాబోతుండడంతో వారి అభిమానులు, అనేకమంది సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఆలియా తల్లికాబోతుండడంతో ఇప్పటికే ఆమె కమిటైన సినిమాల పరిస్థితి ఎంటని కొందరు..ఆలియా సినిమాలు ఆలస్యమవుతాయని మరి కొందరి నుంచి ప్రచారం జరిగింది. దీనిపై ఓ వెబ్ సైట్ వార్తను కూడా ప్రచురించింది. తాజాగా ఈ రూమర్స్‌పై అలియా ఘాటుగానే స్పందించింది.
‘మనం ఇప్పటికీ పితృస్వామ్య ప్రపంచంలో జీవిస్తున్నాం. పాతకాలం భావనల్లోనే ఇంకా చాలామంది ఉన్నారు. నా సినిమాలు ఏవీ ఆలస్యం అవట్లేదు. ఎవరినీ ఎవరూ పైకి తీసుకురావాల్సిన పని లేదు. నేను ఓ మహిళని పార్సెల్‌ని కాదు. నేను విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి డాక్టర్ సలహా మేరకే చేస్తానని తెలుసుకుంటే మంచిది. మనం 2022లో ఉన్నాం. ఇప్పటికైనా అలాంటి ఆలోచనా విధానం నుంచి బయటపడితే మంచిది. ఇప్పుడు మీరు నన్ను క్షమిస్తే.. నేను షూటింగ్‌కి వెళ్లాలి’ అని కోపంతో వెటకారంగా రాసుకొచ్చింది.
కాగా.. తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి అలియా నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మాస్త’ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అలాగే ఈ బ్యూటీ ప్రస్తుతం ‘వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గాడెట్‌తో కలిసి ‘హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart Of Stone)’ హాలీవుడ్ మూవీలో, ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ” అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది.
మొత్తానికి ప్రెగ్నెన్సి వల్ల తన సినిమాలు ఆలస్యం అవుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి ఆలియా ఇచ్చిన కౌంటర్ గట్టిగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె పోస్టు తో నెట్టింట ఇంతవరకు జోరుగా సాగిన ప్రచారం క్రమంగా తగ్గుతున్నట్లు సమాచారం.