కార్తికేయ 2 చిత్రం మీద బాలీవుడ్ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టింది. వరుస ఫ్లాప్ లతో అవమాన భారాన్ని మోస్తున్న బాలీవుడ్ ఎలాగైనా దక్షిణాది చిత్రాలపై పైచేయి సాధించాలన్న కసితో ఉంది. ఒకవిధంగా చెప్పాలంటే నిఖిల్ బాలీవుడ్ కు ఊరూపేరూ లేని హీరో అని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు అతని పేరు హిందీ చిత్రసీమలో మార్మోగిపోతోంది. ఆ సినిమా వసూళ్లు చూసి అందరూ విస్తుపోతున్నారు. 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 102 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. నిఖిల్ రేంజ్ కి ఇది ఎంతో ఎక్కువ. ఒక్క బాలీవుడ్ లోనే 30 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. బాలీవుడ్ లో మొదట 50 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు రెండు వేల థియేటర్లకు విస్తరించిందంటే ఇది ఏ స్థాయి విజయమో అర్థం చేసుకోవచ్చు. కేవలం కృష్ణ తత్వం మూలకథగా రూపొందిన ఈ సినిమా ఉత్తరాది వారిని ఇంతలా ఆకట్టుకుంటుందని ఎవరూ ఊహించలేదు.
మరో విషయం ఏమిటంటే హిందీ డబ్బింగ్ వెర్షన్ బాలీవుడ్ లో టాప్ టెన్ జాబితాలో చోటు దక్కించుకుంది. అది కూడా ఫైనల్ రన్ పూర్తి కాకుండానే ఈ ఘనతను సాధించింది. కొమ్ములు తిరిగిన దక్షిణాది హీరోలను సైతం నిఖిల్ పక్కకు నెట్టేశాడు. వసూళ్ల పరంగా చూస్తే బాలీవుడ్ లో రజనీ కాంత్ నటించిన కబాలి పదో స్థానంలో ఉంది. దీన్ని కార్తికేయ 2 అధిగమించేసింది. కబాలి సినిమా హిందీలో 28 కోట్ల వసూళ్లు సాధించింది. కానీ కార్తికేయ 2 వసూళ్లు 30 కోట్లకు చేరువలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మాధవన్ నటించిన రాకెట్రీ సైన్స్ ‘ది నంబీ ఎఫెక్ట్’.. ‘రాధేశ్యామ్’ చిత్రాల వసూళ్లని సైతం నిఖిల్ క్రాస్ చేసేశాడు. ఇప్పుడు కార్తికేయ 2 ముందు కొత్త టార్గెట్ ఉంది. అందేంటంటే వసూళ్ల పరంగా కేజీఎఫ్ 2కి చేరువలో ఉంది. పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ -2’ వసూళ్లని బ్రేక్ చేస్తే అదో కొత్త రికార్డు అనే చెప్పాలి.అయితే అంత సులువుగా ఇది సాధ్యమవుతుందని చెప్పలేం.
కేజీఎఫ్-2 హిందీలో నే 44 కోట్ల వసూళ్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఒకవేళ ఈ సినిమా వసూళ్లని కార్తికేయ సీక్వెల్ బీట్ చేస్తే దక్షిణాది సినిమాల పరంగా కార్తికేయ-2 కొత్త చరిత్రను సృష్టిస్తుంది. ఓ తెలుగు సినిమాకి ఇలాంటి గుర్తింపు లభించడం విశేషం. ఇప్పుడు బంతి బ్రహ్మాస్త్ర కోర్టులో ఉంది. భారీ అంచనాలతో ఈ సినిమా ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. భారీ తారాగణం, భారీ బడ్జెట్, అంతకన్నా భారీ సీజీ వర్క్ తో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా హిట్ అయితే కార్తేకేయ 2 దూకుడుకు కళ్లెం పడుతుంది. అలా కాకుండా బ్రహ్మస్త్ర ఫట్ అయితే కార్తికేయ 2 హవా ఇంకా కొనసాగుతుంది. బాలీవుడ్ వదిలిన ఈ బ్రహ్మస్త్రం ఇంకా ఎవరెవరి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.