ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి లాంటి సీనియర్లను దూరం చేసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ నష్ట నివారణ చర్యలు
ప్రారంభించింది. అందులో భాగమే ఖమ్మం జిల్లాలో పార్టీ టాప్ లీడర్ మంత్రి కేటీఆర్ అనూహ్య పర్యటన. మహనీయుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఎంతో కొంత మై లేజ్ పొందాలన్న బీఆర్‌ఎస్ వ్యూహం పెద్దగా వర్కవుటవుకోలేదనే చెప్పుకోవాలి. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకీ తెలుగు రాష్ట్రాలకు వీడదీయని సంబంధం ఉంది. ఆ దివంగత నేత కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీని ప్రస్తుతం నడిపిస్తున్న మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై తెలంగాణకు సంబంధం లేనిదంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ కు అనూహ్యంగా విమర్శలు ఎదురయ్యాయి. దీంతో సీన్ రివర్సవుతుందని వూహించిన కేటీఆర్ అనుకోకుండానే ఖమ్మం జిల్లాకు వచ్చేశారు. 40 అడుగులు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా
హడావుడిగా చెప్పాపెట్టకుండానే ప్రారంభించేయటం కూడా దిద్దుబాటుచర్యల్లో భాగమే.
అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణకు తానా లాంటి పెద్ద సంఘాలు బ్రహ్మాండమైన ప్లాన్ చేశాయి. దేశ విదేశాల్లో ఉన్న అన్నగారి అభిమానులను ఆహ్వానించి ఆర్భాటంగా చరిత్రలో నిలిచిపోయేలా విగ్రహావిష్కరణ చేయాలని ఆ సంఘాలో ఆలోచన మధ్యలో కోర్టు వివాదాలు చుట్టుముట్టడం.. జులైలో కోర్టు క్లియరెన్స్ రావటంతో పలు మార్పులు చేసి విగ్రహావిష్కరణకు, చుట్టూ కట్టిన పార్కును కూడా జూనియర్ ఎన్టీఆర్ చేత ప్రారంభించాలని ఆలోచించారు. అయితే మంత్రి కేటీఆర్ స్వయంగా వచ్చి తాను ఆవిష్కరిస్తానంటే కాదనలేక. చివరి నిమిషం వరకూ ….కిందామీదా పడ్డ నిర్వాహకులు..చివరకు నానా తంటాలు పడి పని కానిచ్చేశారు. అయితే అనుకున్నదొకటయితే జరిగింది మరొకటంటూ నిర్వహకులు తిట్టిపోసిన వ్యహారం అక్కడి వాళ్లే స్వయంగా మీడియా ముందు చెప్పటం కేటీఆర్‌కు ఊహించని షాక్. ఎన్టీఆర్ రాలేదు కానీ కేటీఆర్ వచ్చాడని అప్పటికప్పుడు విగ్రహావిష్కరణ ఏమిటంటూ అభిమానులు చేసిన విమర్శలు మాత్రం హైలైట్ అయ్యాయి.
ఈ విగ్రహావిష్కరణ సభలో ఈక్వేషన్స్ దెబ్బతినకుండా కేటీఆర్ జాగ్రత్తగానే అడుగులేశారు. నష్టనివారణ చర్యలు చాలానే చేశారు. ఎన్టీఆర్‌కు తమ పార్టీకి, తమ కుటుంబానికి ఉన్న సంబంధాన్ని ఈ సందర్భంగా విడమరచి వివరంగా చెప్పే ప్రయత్నం చేసిన కేటీఆర్ చేసిన ఎన్టీఆర్ నామస్మరణకు స్థానికులు అభిమానులు
కాస్త ఉప్పొంగిపోయారు. ఎన్టీఆర్ శిష్యుడైన తన తండ్రి కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కాబోతున్నారని, ఆ ఘనత దివంగత ఎన్టీఆర్ కూడా అందుకోలేకపోయారంటూ ప్రశంసలు కురిపించారు. అనూహ్య పర్యటనతో ఖమ్మం జిల్లాలో పొగొట్టుకున్న నేతలను తిరిగి తీసుకురాలేకపోయినా , కేడర్‌లో కాస్త ఉత్సాహం నిపిందని ఆ పార్టీ నేతల వ్యూహం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్ ఇలాంటి ప్లాన్లు ఎప్పుడో చేయాల్సిందని స్థానిక నేతల అభిప్రాయం. ఇప్పటికే పలువురు సీనియర్లు కాంగ్రెస్ కండువా కప్పేసుకోవడంతో మంత్రి పువ్వాడ బలవంతం మేరకే మంత్రి కేటీఆర్ ఖమ్మం టూర్ అని అనుకుంటున్నవారూ లేకపోలేదు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ సభతో కొండంత బలం సంపాదించుకుంటే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, ఎన్టీఆర్ నామస్మరణతో కేటీఆర్ బీఆర్‌ఎస్ కు బలం తెచ్చే ప్రయత్నాలు చేశారు.