తాజ్ మహల్ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలెవరోయ్ అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఎలాంటి అందమైన కట్టడమైనా దానికి మూలపురుషుడిని ఎవరూ విస్మరించకూడదు. తెలుగు సినిమాకి కూడా అలాంటి మూలపురుషుడు ఉన్నాడు. అతడే రఘుపతి వెంకయ్య నాయుడు. 1932లో టాకీ సినిమా పుట్టింది. దానికి ముందు మూకీల యుగమే ఉండేది. ఆ మూకీల నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ ఎవరంటే రఘుపతి వెంకయ్య నాయుడి పేరే చెప్పాలి. తెలుగు సినిమా ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిందంటే అది రఘుపతి వెంకయ్య చలువే. తెలుగు సినిమా కూడా ఆయనను మరువలేదు. ఆయన పేరుతో రఘుపతి వెంకయ్య అవార్డును కూడా ఇస్తూ వస్తున్నారు.
తొలి మూకీ చిత్రాన్ని నిర్మించిన ఘనత ఆయనకే దక్కింది. ఆయన సొంతూరు మచిలీపట్నం. 1887 అక్టోబరు 15న శేషమ్మ, అప్పయ్యనాయుడు దంపతులకు ఆయన జన్మించారు. ప్రముఖ సంఘసంస్కర్త వెంకటరత్నం నాయుడుకు ఆయన స్వయాన తమ్ముడు. ఒక విధంగా ఆయనది వీరయోధుల కుటుంబం. వారి పూర్వికులంతా సైన్యంలో సేనానాయకులుగా పనిచేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటీషు సైన్యంలోనూ వారు సుబేదార్లుగా పనిచేశారు. వెంకయ్య తండ్రి అప్పయ్యనాయుడు కూడా అలా బ్రిటీషు సైన్యంలో సుబేదారుగానే పనిచేశారు.
వెంకయ్యకు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే మహాఇష్టం. అలాగే శిల్పకళ మీద కూడా పట్టు ఉండేది.
కళల మీద తన కుమారుడికి ఉన్న ఆసక్తిని గమనించిన ఆయన తండ్రి అందులో అతన్ని ప్రోత్సహించాలని అనుకున్నారు. అలా మద్రాసుకు పంపించారు. అప్పుడు వెంకయ్యకు 18 ఏళ్లు. మద్రాసు మౌంట్ రోడ్డులో ఓ చిన్న ఇల్లు తీసుకొని అక్కడ ఓ కళా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. తన చిత్రకళకు మెరుగులు దిద్దుకుంటూ వచ్చారు. అవి రాజకుటుంబికులను, జమీందార్లను ఆకర్షించేవి. వారు ఆ కళాఖండాలను కొనుగోలు చేసి వెంకయ్య రాబడికి వూతమిచ్చేవారు. చిత్ర, శిల్పకళలతోబాటు వెంకయ్యకు ఫోటోగ్రఫీ మీద కూడా మక్కువ వుండేది. దాంతో ఒక అలాగే ఓ ఫోటో స్టూడియోను ఏర్పాటుచేశారు.
అదే సమయంలో మూకీ సినిమాలు ఒక్కొటొక్కటిగా రావడం ప్రారంభమైంది. దాంతో వెంకయ్య దృష్టి దాని మీద పడింది. దాని మీద అధ్యయనం చేశారు. తను ఉన్నది ఎలాగూ కళారంగమే కాబట్టి తన సామర్థ్యాన్ని అందులో ఉపయోగిస్తే మంచిదని అనుకున్నాడు. అలాంటి సమయంలో ఆయన దృష్టి ఓ ప్రకటన మీద పడింది. క్రోనో మెగాఫోన్ అనే అక్విప్ మెంట్ అది. దాని ద్వారా ధ్వని తరంగాలు బయటికి వినిపిస్తాయని తెలిసింది. ఒకవిధంగా అది టేప్ రికార్డర్ లాంటిది. మూకీ సినిమాలకు సౌండ్ తోడైతే బాగుందని అనిపించింది. దాన్ని ఆయన లండన్ నుంచి తెప్పించారు. దాంతోపాటు మూకీ సినిమాలకు సంబంధించిన ఫిలిమ్ ను కూడా తెప్పించారు.
మద్రాసులోనే ఓ చోట పెద్ద గుడారం వేసి అందులో మూకీ సినిమా ప్రదర్శించి తను తెప్పించిన క్రోనో మెగాఫోన్ ద్వారా సౌండ్ వచ్చేలా ఏర్పాటుచేశారు. అది సక్సెస్ అయ్యింది. దాంతో 1910లో విక్టోరియా పబ్లిక్ హాలులో ప్రదర్శన ఏర్పాటుచేశారు. బొమ్మలతో పాటు దిమ్మ తిరిగేలా సౌండ్ కూడా రావడంతో జనం ఆనందంతో చప్పట్లు కొట్టారు. అంతా దాన్ని ఓ వింతలా చూశారు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో మద్రాసు ప్రెసిడెన్సీ లోని పట్టణాలు, గ్రామాలతోపాటు మైసూర్, శ్రీలంక, బర్మా లాంటి చోట కూడా ప్రదర్శనలు ప్రారంభించారు. జనానికి వినోదం, వెంకయ్యకు డబ్బు కూడా దక్కింది. అక్కడి నుంచి ఆయన బుర్ర వేగంగా పనిచేయడం ప్రారంభించింది.
మద్రాసులో ఓ థియేటర్ ఉంటే బెటరేమో అనిపించింది. వెంటనే అమలు చేసేశారు. 1912లో మౌంట్ రోడ్ లోనే గెయిటీ థియేటర్ ను ఆయన ప్రారంభించారు. ఒక విధంగా ఇండియాలో మొట్టమొదటి సినిమా హాలును కట్టింది కూడా వెంకయ్యే. అంతకుముందు బ్రిటీషు వారు కట్టిన ప్రదర్శన శాలలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత మింట్ స్ట్రీట్ లో క్రౌన్, పరశువాక్కంలో గ్లోబ్ థియేటర్లు నిర్మించారు. వాటిలో అమెరికా, బ్రిటీషు నుంచి వచ్చిన సినిమాలను ప్రదర్శించేవారు. మిలియన్ డాలర్ మిస్టరీ, మిస్టరీస్ ఆఫ్ మీరా, బ్రోకన్ కాయిన్, రాజాస్ కాస్కెట్ తదితర చిత్రాలను ఈ థియేటర్లలో ప్రదర్శించేవారు.
భలే మంచి సినిమా వ్యాపారం
సినిమా అనేది మంచి వ్యాపార వస్తువు అని మొట్టమొదట అర్థం చేసుకున్న వ్యక్తి రఘుపతి వెంకయ్య. మద్రాసు వచ్చినప్పటి నుంచి ఆయన ఆలోచనలన్నీ సినిమాల చుట్టూనే తిరగడం మొదలెట్టాయి. మనం అమెరికా నుంచి సినిమాలు తీసుకురావడం ఎందుకు మనమే సినిమాలు తీస్తే పోలా అనుకున్నారు. అలా అనుకున్నదే తడవు తన కుమారుడు రఘుపతి సూర్య ప్రకాష్ ను లండన్ పంపారు. సినిమా నిర్మాణాన్ని అధ్యయనం చేయాలన్నది ఆయన ఉద్ధేశం. ఓ సినిమా బయటికి రావాలంటే ఎన్ని దశలు ఉంటాయి, స్టూడియోలు ఎలా ఉండాలి లాంటి విషయాన్నీ ఆయన కుమారుడు స్టడీ చేశారు. అలా అమెరికా, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు కూడా తిరిగారు.
‘టెన్ కమాండ్ మెంట్స్’ సినిమా తీస్తున్న సిసిల్ బి డెమిల్లీ దగ్గర అసిస్టెంట్ గా కూడా సూర్యప్రకాష్ పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఓ కెమెరా కూడా తెచ్చారు. స్టార్ ఆఫ్ ది ఈస్ట్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. తను తెచ్చిన కెమెరాతోనే ‘మీనాక్షి కళ్యాణం’ సినిమా ప్రారంభించారు. మధుర మీనాక్షి ఆలయం సమీపంలో షూటింగ్ చేశారు. అయితే ఈ సినిమా సరిగా రాలేదు. కెమెరాలో సాంకేతి లోపమే అందుకు కారణం. ఆ తర్వాత మరో కెమెరా తెప్పించి ‘భీష్మ ప్రతిజ్ఞ’ తీశారు. అందులో భీష్ముడి పాత్రను వెంకయ్యే పోషించడం విశేషం. ఇది మూకీ సినిమా. సూర్య ప్రకాష్ దీనికి దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.
1921 నుంచి వరుసగా గజేంద్రమోక్షం, భక్త నందనార్, సముద్ర మధనం, మత్స్యావతారం సినిమాలు తీశారు. అప్పట్లో సినిమాల్లో నటించడానికి యువతులు ముందుకు వచ్చేవారు కాదు. దాంతో ఆంగ్లో ఇండియన్ మహిళలను పిలిపించి ఆయా పాత్రలు వేయించేవారు. సినిమాల నిర్మాణం కోసం ఓ స్టూడియో కూడా కట్టేశారు. కరెంటు లేనప్పుడు ఇబ్బింది లేకుండా పైకప్పును అద్దాలతో వేశారు. అందువల్ల దానికి గ్లాస్ స్టూడియో అనే పేరొచ్చింది. 1927 నుంచి చిత్ర నిర్మాణాన్ని మరింత పెంచారు. పెట్టిన పెట్టుబడికి తగినట్లుగా డబ్బు రాకపోవడంతో ఆయన అప్పులపాలయ్యారు.
సినిమా తెర ఎలా ఉండేదో తెలుసా?
మనం ఇప్పుడు వెండి తెర అని ముద్దుగా పిలుచుకునే తెర ఒకప్పుడు తెల్ల గోడ మాత్రమే. థియేటర్లో గోడ మీదే సినిమాలను ప్రదర్శించేవారు. అందుకనే ఆరోజుల్లో మూకీలను గోడమీద బొమ్మలు అని పిలిచేవారు. ఆ తర్వాత ఈ తెరల స్వరూపం మారిపోయింది. గోడలు పోయి తెరలు కట్టడం ప్రారంభమైంది. అలా సినిమాలకు సంబంధించిన అన్ని దశలనూ వెంకయ్య చూశారు.. జనానికి చూపించారు. 1929లో స్టూడియోను పునర్నిర్మించారు. టాకీలు వచ్చాక కూడా వారు సినిమా నిర్మాణాన్ని ఆపలేదు. పి.పుల్లయ్య, వై.వి. రావు లాంటి ప్రముఖ దర్శకులు సూర్యప్రకాష్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసినవారే.
దర్శకుడిగా సూర్యప్రకాష్ 1960 వరకూ సినిమాలు తీస్తూనే ఉన్నా ఆశించిన విజయాలు మాత్రం ఆయనకు దక్కలేదు. 1941 మార్చి 15న రఘుపతి వెంకయ్య కన్నుమూశారు. తెలుగు సినిమాకు వెంకయ్య చేసిన సేవలను ప్రభుత్వం గుర్తుంచుకుని ఆయన పేరుతో రఘుపతి వెంకయ్య అవార్డును కూడా ఇస్తూ వస్తోంది. నంది అవార్డుల ఇచ్చేటప్పుడే ఈ అవార్డును కూడా ఇస్తూ వస్తున్నారు. ఇండియన్ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎలాంటిదో తెలుగు సినిమాకు కూడా ఇది ఓ ప్రతిష్ఠాత్మక అవార్డు. తొలిసారిగా ఈ అవార్డును ఎల్. వి. ప్రసాద్ అందుకున్నారు.
2016లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అవార్డును అందుకున్నారు. రఘుపతి వెంకయ్య పేరుతో ఓ బయోపిక్ కూడా రూపొందింది. బాబ్జీ దర్శకత్వంలో సతీష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకయ్య పాత్రను నరేష్ పోషించారు. తెలుగు సినిమాకు ఇంత వెలుగులు అందించిన వెంకయ్యకు చివరికి మిగిలింది ఏదీ లేదని అంటారు. ఆయన తెరవెలుగుల జీవితాన్ని శుభం కార్డు ఇలా పడటం మాత్రం తెలుగు సినిమా చేసుకున్నదురదృష్టం. రఘుపతి వెంకయ్యకు లియోన్యూస్ ఘనంగా నివాళులు అర్పిస్తోంది.
-హేమసుందర్ పామర్తి











