(ఒంగోలు నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
ఎట్టకేలకు పోతుల సునీత ఎమ్మెల్సీ రాజీనామాను.., మండలి ఛైర్మన్ ఆమోదించారు. ఎంఎల్సీగా కొనసాగుతూ.., వైసీపీకి మద్దతుగా కొనసాగాలన్న ఆమె కలకు., టీడీపీ సభ్యులు సాక్ష్యాలతో సహా మండలి ఛైర్మన్ షరీఫ్ ముందు ఉంచడంతో.., అనర్హత వేటు తప్పదని తెలిసి ఆమె గతంలోనే రాజీనామా ఇచ్చారు. ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై జరిగిన ఓటింగ్ విషయంలో టీడీపీ విప్ ని ధిక్కరించడంతో పాటు.., తనపై టీడీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ విచారణకు మండలి ఛైర్మన్ ముందు హాజరుకాకుండా పదే పదే సాంకేతిక కారణాలను అడ్డం పెట్టుకోవాలని ఆమె చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
మండలి చైర్మన్ ముందు హాజరు కాకుండా? ఆమె చేసిన ప్రయత్నాలు ఉద్దేశపూర్వకమే అనే వీడియో క్లిప్ లను మండలి చైర్మన్ ముందు టీడీపీ ఉంచింది. ఇక అనర్హత వేటు తప్పదని తెలిసి, వైసీపీ పార్టీ పాలసీకి కట్టుబడినట్లు ఆ పార్టీ అధిష్టానం మెప్పు పొందే ప్రయత్నంలో.., రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అడుగడుగునా కోర్టులను అడ్డుపెట్టుకుని టీడీపీ, చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని. టీడీపీ వైఖరి రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందని. దీనికి నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
టార్గెట్ చీరాలలో పాగా వేయడమేనా..?
పోతుల సునీత 2014లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చీరాల నుంచి బరిలో దిగారు. ఆమంచి కృష్ణమోహన్ పై పరాజయం చవి చూశారు. ఓటమి తర్వాత కూడా టీడీపీలోనే కొనసాగారు. ఓ పక్క ఆమంచిని ఎదుర్కొంటూనే.., అనంతపురంలో పాగా వేయాలని పోతుల కుటుంబం ప్రయత్నం చేసినా, అది సాధ్యం కాలేదు. ఇక చేనేత సామాజిక వర్గానికి చెందిన ఆమె తన కులస్తుల ఓట్లు బలంగా ఉన్న చీరాలనే సేఫ్ ప్లేస్ గా భావించి అక్కడి నుంచే రాజకీయంగా నిలబడే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె ప్రత్యర్థి ఆమంచి 2014లో విజయం సాధించిన ఏడాదికే టీడీపీలో చేరడంతో ఆమె ఆశలు గల్లంతయ్యాయి. కానీ, 2019లో చీరాలలో ఆమంచి ఓడిపోవడం, ఎమ్మెల్యేగా కరణం బలరాం గెలివడం ఆమెకు కలసి వచ్చింది. ప్రస్తుతం ఆమంచి vs కరణం వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండటంతో వైసీపీ అధిష్టానం అక్కడ మార్పులు చేయాలని చూస్తోంది.
పర్చూరులో వైసీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో ప్రస్తుతానికి ఆమంచిని పర్చూరు నియోజకవర్గం ఇంఛార్జిగా నియమించి.., చీరాలలో కరణం, ఆమంచి పోరుకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ ఆలోచనగా ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే జగన్ నిర్ణయం అయితే.., దీనికి ఆమంచి అంగీకరించకపోయినా.., వెళ్ళాలి అనుకుంటే తలుపులు ఎప్పుడో తెరిచే ఉంచాము అని అధిష్టానం చెప్పే అవకాశం కూడా ఉంది. జిల్లా వైసీపీ నేతలు కూడా ప్రస్తుతానికి పర్చూరు బాధ్యతలు చూడమని, కరణం కుటుంబం వచ్చే ఎన్నికల నాటికి అద్దంకి వెళ్తుందని.., అప్పుడు టికెట్ నీకే ఇస్తామని ఆమంచికి నచ్చజెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ఆమంచి అంగీకరించక పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కరణంకి పూర్తిగా నియోజకవర్గాన్ని అప్పగించడానికి ససేమిరా అనే ఛాన్స్ ఎక్కువ.
3 ఏళ్ల పాటు ఇక తనకు వైసీపీలో గడ్డు కాలం అని, తనకు పట్టున్న చీరాలే ముఖ్యం అనుకుంటే పార్టీ మారినా ఆశ్యర్యం లేదు. ఇదే జరిగితే కరణం మద్దతుతో చీరాల నియోజకవర్గం ఇంఛార్జిగా తనకు అవకాశం వస్తుందని పోతుల సునీత భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆమె చీరాలలో ఇప్పటికీ ఏ చిన్న పార్టీ కార్యక్రమం జరిగినా, హాజరవుతూనే ఉన్నారు.
2019 ఎన్నికల్లో పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్రావుకు మద్దతుగా ఆమంచి సోదరుడు స్వాములు పనిచేశారు. వీరికి దగ్గుబాటి కుటుంబంతో రాజకీయంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కరణం ఎలాగూ 2019 ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వర్రావు ఓటమికి కారణం అయ్యారు కాబట్టి.., ఆమంచి బీజేపీలోకి వస్తానన్నా దగ్గుబాటి సహకరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే .., చీరాలలో పోతుల సునీత వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి అవ్వడానికి దారులు సుగమం అయినట్లే. మహిళ కావడం, చేనేత సామాజికవర్గం కావడంతో పాటు.., గతంలో నక్సల్ బరీ ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం.., ధైర్యంగా ఆమంచిని ఎదుర్కొన్న తీరు ఆమెకు ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయని ఆమె వర్గం అంటోంది. కరణం అండ ఎలాగూ ఆమెకు ఉంది. దీనికి తోడు.., కరణం, ఆమంచి ఇద్దరిని ఈ మూడేళ్లు చీరాలలోనే ఉంచి పనిచేయించుకోవడం వైసీపీకి అసాధ్యం అని ఇప్పటికే అర్థమైపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టే దిశగా.., సామ, దాన, భేద, దండోపాయాల్ని జగన్ అనుసరించే అవకాశం ఉంది. వీటిలో ఆమంచి, బలరాం లలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గని పరిస్థితి తప్పదు. ఒకవేళ ఆమంచికి వ్యతిరేక నిర్ణయం చీరాలలో వస్తే.., అది పోతుల సునీతకు శుభసంకేతమయ్యే అవకాశం ఉందని ఆమె అనుచరులు భావిస్తున్నారు.
చూడాలి.., చీరాలలో వైసీపీలో ఆమంచి, కరణం వర్గాల మధ్య పోరును చెక్ పెట్టే నిర్ణయంపై పోతుల సునీత రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. స్థానిక సంస్థల నాటికి ఏదో ఓ నిర్ణయం వైసీపీ అధిష్టానం తీసుకుంటే గానీ, సునీత రాజకీయ అడుగులపై ఓ స్పష్టత వచ్చే అవకాశం లేదు.