పార్టీ ప్రచార హోరుతో ముగిసిన ఎన్నికల ప్రచారం ఇప్పుడు అరెస్టులతో కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు బీజేపీ నేతుల ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఇంద్రసేనా రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేలా టీఆర్ఎస్ నేతలు డబ్బును పంచుతున్నారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం ముందు బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఎన్నికల్లో ఎన్నికల సంఘం అధికారులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు గానీ పట్టించుకోవడంలేదని ధర్నాకు దిగారు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే ధర్నాపై సమాచారం అందుకున్న పోలీసులు.. రఘునందన్‌రావు, రాంచందర్‌రావు, ఇంద్రసేనారెడ్డితో పాటు మరికొంత మంది నేతలను అరెస్టు చేసి తరలించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఎన్నికల సంఘం, పోలీసులపై ఆరోపణలు చేశారు.
ఓటర్లకు డబ్బుల పంపిణీ…
హైదరాబాద్‌లో అధికార పార్టీ నేతలు కొందరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే వీడియో వైరలయ్యింది. నకిరేకల్ నియోజకవర్గం అధికార పార్టీకి చెందిన ఒక నేత అనుచరులు హైదరాబాద్ గడ్డి అన్నారంలో ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తుండగా స్థానికులు పట్టుకున్నట్లు సమాచారం. అయితే వారిని స్థానికులు పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. బూత్‌కో ఇంఛార్జ్ ద్వారా డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు పోలీసుల ముందు వారు ఒప్పుకున్నట్లు వార్తలు వైరలయ్యాయి. ఒక అధికార ప్రతినిధి ఆదేశాలతో ఓటుకు నోటు ఇస్తున్నట్లుగా వారు వెల్లడించినట్లు తెలిసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ స్థానిక ప్రజలు ఆందోళన చేప్టటినట్లు సమాచారం.