(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ప్రకాశం జిల్లా టీడీపీ నేతల గ్రానైట్ లీజుల రద్దు నోటీసులు చెల్లవని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులకు చెందిన 11 గ్రానైట్ లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు చెల్లవని హైకోర్టు తీర్పు వెల్లడించింది.
టీడీపీని అన్ని విధాలా దెబ్బతీసేందుకు అన్నట్టుగా వైసీపీ పెద్దలు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా నిబంధనలను ఉల్లంఘించారంటూ రూ.500 కోట్ల అపరాధ రుసుం విధించారు. దీనిపై గొట్టిపాటి రవికుమార్, పోతుల రామరావు హైకోర్టును ఆశ్రయించారు.
వారి వాదనలను విన్న హైకోర్టు అపరాధ రుసుములను రద్దు చేసింది. దీంతో ఆగని ప్రభుత్వం తరవాత కాలుష్య నియంత్రణ మండలి అధికారులను పురమాయించారు. నిర్దేశించిన పరిమాణం కంటే పెద్ద మొత్తంలో కాలుష్యం వస్తోందంటూ ఆయా గ్రానైట్ కంపెనీలకు నోటీసులు ఇచ్చి, లీజులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. గ్రానైట్ లీజులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది.
హైకోర్టు తీర్పును వైసీపీ ప్రభుత్వం గౌరవిస్తుందా?
టీడీపీ నేతల గ్రానైట్ లీజుల రద్దు వ్యవహారం ఇంతటితో ముగుస్తుందని ఎవరూ భావించడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూరితంగా చేస్తున్న వ్యవహారం కావడంతో వీరిపై ఎలాంటి చర్యలకు దిగుతారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రానైట్ లీజులను పునఃసమీక్షించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న గ్రానైట్ లీజుల వల్ల ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతోందనే సాకుతో గ్రానైట్ రాయికి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను భారీగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే జరిగితే గ్రానైట్ లీజులు టీడీపీ వారి చేతిలో ఉన్నా ప్రభుత్వం పన్నులు భారీగా పెంచితే వారికి వ్యాపారం గిట్టుబాటు కాని పరిస్థితి వస్తుంది. అప్పుడు వారు గనులు వదులుకునే అవకాశం ఉంది.
రవాణాపై ఆంక్షలకు అవకాశం?
గ్రానైట్ ముడి రాయి ప్రధానంగా చైనా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఒక్కో రాయి బరువు 40 నుంచి 60 టన్నల వరకు ఉంటుంది. రహదారులపై వాటిని ఓడరేవులకు తరలించాల్సి ఉంటుంది. గ్రానైట్ రాయి తరలించే వాహనాల సామర్ధ్యాన్ని బట్టి బరువు పరిమితులు ఉంటాయి. రవాణా అధికారులు ఖచ్చితంగా వ్యవహరిస్తే చాలా వాహనాలు తిప్పలేని పరిస్థితి నెలకొంటుంది. అలా గ్రానైట్ రవాణాను అడ్డుకునే దారులను ప్రభుత్వం వెతుకుతోంది. అందులో కూడా రాజకీయ రాగద్వేషాలకు అనుగుణంగా తనిఖీలు, ఎగుమతులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించే అవకాశం లేకపోలేదు.