రాజమౌళి తోపు.. దీన్ని ఎవరూ కాదనరు.. ఆయన హీరో కూడా తురుమే.. దీన్ని కూడా ఎవరూ కాదనలేరు. అమరశిల్పి జక్కన్న లాగా సినిమాని చెక్కుతాడు.. ఆ విషయం అందరికీ తెలుసు.. అందుకే ఆయన సినిమా జక్కన్న అయ్యారు.
రాజమౌళి సినిమాలో హీరోగా అవకాశం వస్తే పాన్ ఇండియా పదవి ఖాయం.. అది కూడా కాదనలేని సత్యం. మరి వచ్చిన చిక్కేమిటి? ఓ స్టార్ హీరో జక్కన్నతో సినిమా చేస్తే చాలా చిక్కులే వస్తున్నాయి. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ఆయన అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఏడాదికి తక్కువలో తక్కువ రెండు సినిమాలైనా తమ అభిమాన హీరోవి రావాలని కోరుకుంటారు.
బాహుబలితో ప్రభాస్ జీవితం మారిపోవచ్చు.. కానీ రూపురేఖలు మారిపోతాయన్న నగ్నసత్యాన్ని కూడా గమనించాలి. నాలుగేళ్ల పాటు ఒక సినిమా చేసే బదులు అదే నాలుగేళ్లలో ఓ పది సినిమాలు చేస్తే మరోలా ఉంటుంది. రాజమౌళితో సినిమా పూర్తయ్యేలోపు గడ్డాలు మీసాలు నెరిసిపోకుండా ఉంటే చాలు. రాజమౌళికి నెరిసిపోయినా ఎలాంటి ఇబ్బందీ లేదు. ఎందుకంటే ఆయన తెరవెనకే ఉంటారు కాబట్టి.
బాహుబలికి ముందు.. తర్వాత..
ఈ మధ్య తెలుగు సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడాల్సి వస్తే బాహుబలికి ముందు.. తర్వాత అంటున్నారు. కెరీర్ కూడా అంతే అనుకోవాలి. బాహుబలికి ముందు వరకూ రాజమౌళి సినిమాల విషయంలో ఎలాంటి అనుమానాలూ ఉండేవి కాదు. ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమా అనే పదం బయలుదేరిందో అప్పుడే రాజమౌళి శైలి కూడా మారిందనుకోవాలి. 2001లో స్టూడెంట్ నంబర్ వన్ తో దర్శకుడిగా జనం ముందుకు వచ్చారు రాజమౌళి. 2007 వరకూ ఏటా ఒక్కో సినిమా చేస్తూ వచ్చారు.
అన్నీ హిట్లే. సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ వరకూ సాఫీగా ప్రయాణం సాగిపోయింది. 2007లో యమదొంగ విడుదలైతే 2009లో మగధీర వచ్చింది. ఇక్కడ మాత్రం రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 2012లో ఈగ వరకూ కంటిన్యూగా ఏడాది ఒక సినిమా విడుదలవుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి – ద బిగినింగ్ 2015లోగాని విడుదల కాలేదు. ఆ సినిమాని ఆయన అంతకాలం పాటు చెక్కుతూ వచ్చారు. కట్టప్పను బాహుబలి ఎందుకు చంపాడో తెలియడం కోసం జనం మరో మూడేళ్లు ఆగాల్సి వచ్చింది.
మొత్తానికి బాహుబలి సినిమా దాదాపు 5 ఏళ్ల పాటు హీరోగా ప్రభాస్ కెరీర్ ను అడ్గుకుందనే చెప్పాలి. పాన్ ఇండియా హీరోని బాహుబలి చేసినందుకు సంబర పడాలో, ఐదేళ్ల సినీ జీవితాన్ని కోల్పోయినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి ప్రభాస్ ది. కానీ రూ. 100 కోట్ల హీరోగా మాత్రం ఎదిగిపోయాడు. బాహుబలికి ఆయనకు ముట్టింది ఎంతో మనకు తెలియకపోయినా ఫరవాలేదు.
ఆర్ఆర్ఆర్ తో.. ఏం సాధించారు?
బాహుబలి తర్వాత రాజమౌళి ఏ సినిమా చేస్తున్నారు అన్న క్యూరియాసిటీ నుంచి ట్రిపుల్ ఆర్ పుట్టింది. నాలుగేళ్లుగా ఈ ట్రిపుల్ ఆర్ ను ఆయన చెక్కుతూనే ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ అనే ఇద్దరు హీరోలు ఆయనకు దొరికిపోయారు అనుకోవాలా? దొరికారు అనుకోవాలో అర్థం కాదు. 2018 నవంబరు 19 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 2020 జులై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. హమ్మయ్య జక్కన్న త్వరగానే సినిమాని జనం ముందుకు తీసుకొస్తున్నారని అందరూ ఊపిరితీసుకున్నారు.
కానీ కరోనా వచ్చి రాజమౌళి స్పీడును అడ్డుకుంది. ఇప్పుడు తప్పు నాది కాదు కరోనాది అంటారు రాజమౌళి. అలా వాయిదాలు పడుతూ 2021 దసరాకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అది కూడా సాధ్యం కాలేదు. చివరికి విడుదల తేదీ జనవరి 7, 2022 జనవరికి మారింది. దీని కోసం ఆలియా భట్ గంగూభాయి కతియావాడి, భీమ్లానాయక్ లు కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. చివరికిక ఈ 7 తేదీ విడుదల కావల్సిన ట్రిపుల్ ఆర్ ఏప్రిల్ కు వాయిదా పడిపోయింది. ఓ పక్క ఈ సినిమా షూటింగ్, ఇంకో పక్క సినిమా ప్రచారం అంటూ హీరోలు కాలయాపన చేయాల్సి వచ్చింది. తమ ఇతర సినిమాలను కూడా పక్కన పెట్టి వారు శ్రమించారు.
ఇక్కడ రాజమౌళిని కూడా తప్పు పట్టాల్సిన పనిలేదు. ఈ హీరోలను నమ్ముకుని ఇతర నిర్మాతలు, దర్శకులు ఉంటారన్న సంగతిని కూడా మరచిపోకూడదు. సినిమా కోసం బిగ్ బాస్ హీందీ షోకు, కపిల్ శర్మ కామెడీ షోకు కూడా వెళ్లారు. చివరికి ఇదంతా కామెడీగా మారింది. పెయిడ్ ప్రమోషన్ కాబట్టి చేతులు కాలేది నిర్మాతకూ, బయ్యర్లకే. ఈ టైమ్ వేస్ట్ మాత్రమే కాదు కెరీర్ కూడా రోస్ట్ అయ్యిందనే చెప్పాలి. రామ్ చరణ్ మాత్రం తెలివిగా వ్యవహరించి ‘ఆచార్య’ను పూర్తి చేసేసుకున్నాడు. ఎటూ నష్టపోయింది మాత్రం ఎన్టీఆర్. ఈ ట్రిపుల్ ఆర్ కోసం వెచ్చించిన సమయంలో ఓ ఆరు సినిమాలు చేసినా రూ. 200 కోట్లు సంపాదించి ఉండేవారు.
రాజమౌళి తర్వాత ప్రాజెక్టు మహేశ్ బాబుతో అనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే ప్రభాస్, ఎన్టీఆర్ మాదిరి నష్టపోతానని మహేశ్ భావిస్తే ఎలా ఉంటుంది. అసలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ కరెక్టేనా? బహుశా ఇలాంటి సాహసం ఈ కరోనా కాలం చేయకుండా ఉండటమే మేలేమో అన్న ఆలోచన నిర్మాతలకు వస్తోంది. రాజమౌళి సినిమా కదా అనుకుని తమ స్టార్ డమ్ ను రాజమౌళి ముందు పణంగా పెట్టాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారు. రాజమౌళితో సినిమా చేస్తే బాహు‘బలే’నా అనుకోవాల్సి వస్తోంది.











