ఆ కేంద్ర మంత్రిని కలిసింది.. అందుకేనా?
సీఎం జగన్ రెడ్డి రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, విభజన హామీలు, పోలవరం నిధులు, లోటు బడ్జెట్ అంటూ ఇలా చాంతాండంత లిస్ట్ సాధనకు ముఖ్యమంత్రి పర్యటన ప్రాధన్యత సంతరించుకుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తుంటే, కాదుకాదు.. కేవలం తన కేసులను మాఫీ చేసుకునేందుకు ప్రధాని మోది, అమిత్ షాలను ప్రసన్నం చేసుకునేందకు ఢిల్లీ వెళ్లారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదిఏమైనా జగన్ రెడ్డి సోమవారం, మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నితిన్, నిర్మలా, అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్ లతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్థికి సహకరించాలని విజ్ఞాపనలు అందించినట్లు తెలుస్తోంది. అయితే జగన్ పర్యటనలో ప్రస్తుతం ఓటీటీ అంశం కూడా తెరపైకి వస్తోంది. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో వైఎస్ జగన్ రెడ్డి భేటీ కావడంతో ఎప్పటి నుంచో ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెలకొల్పాలన్న ప్రభుత్వ ఆలోచనకు ఈ భేటీ క్లారిటీ ఇచ్చింది. దీనికి అవసరమైన అనుమతులను మంజూరు చేయాలని కేంద్రమంత్రికి జగన్ విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.
జగన్ ప్రభుత్వానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్ అవసరమే..!
జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్ అవసరమేనని ఆపార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే జగన్ పై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అంతేకాక పార్టీ నేతలలో కూడా జగన్ పై పెట్టుకున్న నమ్మకం రోజురోజుకు సడలుతోంది. ఈ క్రమంలోనే మీడియా మొత్తం జగన్ చర్యలను ఎండగడుతోంది. ప్రతిపక్ష కన్నా మిన్నగా మీడియా పదునైనా కథనాలతో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేకత నిర్ణయాలను ఎత్తిచూపుతున్నాయి. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డికి తన సొంత మీడియాతో పాటు, ప్రభుత్వం తరుఫున ఒక ఓవర్ ది టాప్ ( ఓటీటీ ) ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఇదివరకే ప్రయత్నాలు సాగించినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే దీనిని ఏపీలో తీసుకొచ్చేందుకు జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం తరుఫున సొంత ఓటీటీ ని తీసుకొచ్చి, ప్రభుత్వ పథకాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే సాధనంగా మల్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో జగన్ చర్చించారని సోషల్ మీడియా ప్రచారం ఊపందుకుంది.