ఏపీ ప్రభుత్వంపై సినిమా రంగం నుంచి అస్త్రశస్త్రాలకు సమయం ఆసన్నమైనట్టే ఉంది. ముఖ్యంగా మోహన్ బాబు లేఖాస్త్రంతో ప్రారంభమైన ఈ ప్రక్రియ ఆర్జీవీ అస్త్రంతో యుద్ధం మొదలైనట్టే ఉంది. తన ట్విట్టర్ ద్వారా ఆర్జీవీ వరుసగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఆర్జీవీ అంటేనే ఓ సెన్సేషన్. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఎలా గురిపెడతాడో ఎవరి ఊహకూ అందదు. ఆర్జీవీ ఇలా మాట్లాడతాడు అనుకునేవారికి ఆయన నుంచి భిన్నమైన ప్రతిస్పందన ఆయన నుంచి లభిస్తుంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న చర్చ ఏదైనా ఉంది అంటే అది టిక్కెట్ ధరల ఇష్యూనే. మరి ఆర్జీవీ గళం విప్పకుండా ఎలా ఉంటాడు. ఈ మధ్య కాలంలో ఏపీలో కొన్ని థియేటర్లు కూడా మూతపడ్డాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. ఏపీ ప్రభుత్వం నుంచి ఏం ఆశించినా దానికి అనుకూలమైన సమాధానం రావడంలేదు. ఇప్పుడు రంగంలోకి దిగడం ఆర్జీవీ వంతైంది. ఆర్జీవీ వేసే ప్రశ్నలకు మంత్రి నాని ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇంతకుముందు ఇదే అంశంపై మాట్లాడిన హీరో నాని, మరో హీరో సిద్ధార్థ్ లకు గట్టిగానే రిటార్డ్ ఇచ్చారు అమాత్యులు.
ఆర్జీవీ వేసిన ప్రశ్నలు
సినిమానే కాదు మరే ఉత్పత్తి అయినా ఎంత ధర నిర్ణయించాలనే విషయంలో ప్రభుత్వ పాత్ర కచ్చితంగా ఉంటుంది. స్టార్ హీరోకి ఎంత పారితోషికం ఇవ్వాలనే విషయంలో కూడా ఆ సినిమా ఎంత వసూలు చేసిందన్న అంశం ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని ఆర్జీవీ చెబుతూ మంత్రులు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. నిత్యావసరాల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వం అర్థం చేసుకుని ధరను నిర్ణయించవచ్చు.. అయితే దీన్ని సినిమాకు ఎలా అన్వయించగలం అని ఆయన ప్రశ్నించారు. ‘ధాన్యం ధర తగ్గిస్తే రైతులు నష్టపోతారు, దీనివల్ల రైతు దీని మీద దృష్టిపెట్టడు. ఇదే సూత్రం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుంది.
పేదలకు సినిమా అవసరం అని ప్రభుత్వం భావిస్తే ఆ ప్రభుత్వ డబ్బులోంచే చెల్లించి.. అంటే విద్య, వైద్య సవలకు ఎలా రాయితీలు ఇస్తున్నారో అలాగే సినిమాకు సబ్బిడీలు ఇవ్వవచ్చు కదా?’ అన్నారు. రేషన్ షాపుల మాదిరిగానే రేషన్ థియేటర్లు కూడా ఏర్పాటుచేసే దిశగా ఆలోచిస్తే బాగుంటుందని సూచించారు. అలాగే మరో ట్వీట్ చేసి టిక్కెట్ ధరను నిర్మాతే నిర్ణయించి విక్రయిస్తే ప్రభుత్వం కొన్ని టిక్కెట్ లను కొని పేదలకు తక్కువ ధరకు అమ్మవచ్చని కూడా సూచించారు. దీనివల్ల మేము డబ్బు సంపాదించుకోవచ్చు.. మీరు ఓట్లు పొందవచ్చు అంటూ వరుస ట్వీట్లు చేశారు. దీనికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి. మంత్రి పేర్ని నాని ఆర్జీవీకి ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.











