వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాకిచ్చారు పోలీసులు. ఆయనపై పోలీసు కేసు నమోదైంది. సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అంబటిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా అంబటి రాంబాబు పోలీసులపై రెచ్చిపోయారు. వారి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. సత్తెనపల్లి మండలం కంటేపూడి దగ్గర బ్యారికేడ్లను తొలగించి అంబటి హల్‌చల్ చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అంబటి బారికేడ్లను తోసుకెళ్లే సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు అంబటిపై మరో కేసు నమోదైంది. దీంతో సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అంబటిపై రెండు కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పల్నాడు బార్డర్ వద్ద అంబటి రెచ్చిపోయారు. జగన్ పల్నాడులోకి ప్రవేశించాక ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తల వాహనలను జిల్లా సరిహద్దులో బారికేడ్లు పెట్టి నిలిపివేశారు పోలీసులు. ఈ సమయంలో అటుగా వస్తున్న అంబటి పోలీసులపై విరుచుకుపడ్డారు. రోడ్డుపై పెట్టిన బారికేడ్లను విసిరిపారేశారు. అంబటితో పాటు ఆయన సోదరుడు కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.
అక్కడ ఉన్న పోలీసులను కూడా మీ అంతు చూస్తామనంటూ వార్నింగ్ ఇచ్చారు అంబటి. రోడ్డుపై బారికేడ్లను తొలగించి వైసీపీ కార్యకర్తలను ముందుకు పంపించారు. అయితే పోలీసులతో అంబటి ప్రవర్తనపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా కూడా గుంటూరు జిల్లా పట్టాభిపురం సీఐపై కూడా అంబటి ఇలాగే దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయంలోనే సీరియస్‌గా ఉన్న పోలీసులు..నిన్న కూడా రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను విసిరిపారేయడంతో పాటు పోలీసులపై దౌర్జన్యం చేయడంతో అంబటిపై కేసు నమోదు చేశారు. అయితే రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు అంబటిని విచారణకు పిలుస్తారా..అరెస్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది











