ఈమధ్యకాలంలో ఎంట్రీ ఇచ్చిన కథానాయికల్లో మాస్ ఆడియన్స్ మనసులు దోచేసిన బ్యూటీగా నభా నటేశ్ కనిపిస్తుంది. కన్నడ సినిమాలతో కెరియర్ ను మొదలెట్టిన ఈ సుందరి, ‘నన్నుదోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెరపై నభా నటేశ్ ను చూడగానే, బాదుషాలా అమ్మాయ్ భలేగా ఉందే అనుకున్నారు. మాస్ కుర్రాళ్లు మాత్రం హాట్ హాట్ గా ఊరించే మిరపకాయ్ బజ్జీని ఊహించుకున్నారు. మాస్ కుర్రాళ్లు ఏమనుకుంటున్నారో పూరికి వెంటనే తెలిసిపోతుంది. అందుకే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో అమ్మాయి అందచందాలను ఒక రేంజ్ లో చూపించాడు.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ హిట్ కొట్టిన నభా, ఆ తరువాత సినిమాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ చేసింది. ఇటీవల థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సాయిధరమ్ తేజ్ తో కలిసి అమ్మాయి చేసిన అల్లరి, కొత్త ఆవకాయ్ పచ్చడిలా తెగ నచ్చేసింది. ఇక త్వరలో ఈ పిల్ల ‘అల్లుడు అదుర్స్’ సినిమాతో పలకరించనుంది. బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా ఈ సినిమాలో ఆమె కనువిందు చేయనుంది. ఇది కూడా మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న మూవీనే. ఈ సినిమా కూడా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే ధీమాతో నభా నటేశ్ ఉంది.
ఇక చాలా మంది హీరోయిన్స్ ఒక వైపున హీరోయిన్ గా దూసుకుపోతూనే, మరో వైపున స్పెషల్ సాంగ్స్ లో అదరగొడుతున్నారు. అందుకుగాను వాళ్లు భారీ పారితోషికమే అందుకుంటున్నారు. అయితే తనకి మాత్రం ఇప్పట్లో స్పెషల్ సాంగ్స్ చేసే ఆలోచన లేదని తాజా ఇంటర్వ్యూలో నభా చెప్పింది. తనని మాస్ యాంగిల్ లో చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారనీ, అందువలన ఆ తరహా పాత్రలకి తాను ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. కొత్త ఏడాదిలో ఈ హాట్ బేబీ తన బీట్ ను .. హీట్ ను ఏ రేంజ్ లో పెంచుతుందో చూడాలి మరి.