వాహనదారులకు శుభవార్త. రేపటి నుంచి దేశవ్యాప్తంగా వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరని కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను మరోసారి మార్పులు చేసింది. ఫాస్టాగ్ గడువును 2021, ఫిబ్రవరి 15కు పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటికే ఫాస్టాగ్ ద్వారా 80 శాతం చెల్లింపులు జరుగుతున్నాయి. ఫాస్టాగ్ కోసం లక్షలాది మంది ఒకేసారి ప్రయత్నించడంతో సేవలు అందిస్తున్న ఆయా సంస్థలపై పనిభారం ఎక్కువైందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అనేక ప్రయోజనాలు
వాహనదారుల ఫాస్టాగ్ తో టోల్ చెల్లింపులు చేయడం వల్ల లైన్లలో ఎక్కువ సేపు ఆగాల్సిన పనిలేకుండా పోయింది. దీని వల్ల విలువైన సమయంతోపాటు, ఇంధనం కూడా భారీగా ఆదా అవుతుంది. ఫాస్టాగ్ ద్వారా నగదు రహిత చెల్లింపు చేయడం వల్ల టోల్ గేట్ల వద్ద వేలాది మంది సిబ్బంది అవసరం కూడా తగ్గిపోనుంది. ఫాస్టాగ్ కు యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబరు కేటాయిస్తారు. దాన్ని వాహనానికి అతికించుకోవడం ద్వారా టోల్ ఫ్లాజా వద్దకు వాహనం ప్రవేశించగానే సంబంధిత అకౌంట్ నుంచి టోల్ టాక్స్ కట్ అవుతుంది.











