(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపైన, దేవుళ్లపైన, ఆ మాట కొస్తే హిందుత్వంపైన దాడి జరుగుతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటన జరిగిన తరువాత సంబంధిత మంత్రి ఒక ప్రకటన చేయడం, విచారణ జరిపిస్తాం, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించడమే తప్ప కార్యాచరణ లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్ల దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయి. హిందుత్వ వాదులు, విపక్షాలు గొంతు చించుకుంటున్నా ప్రయోజనం లేకపోతోంది. దీనికంతటికీ ప్రభుత్వ ఉదాసీన వైఖరి, దేవాదాయ శాఖ నిర్లక్ష్యం ప్రధాన కారణాలుగా ఆరోపణలొస్తున్నాయి.
దాడుల పరంపర
విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనలో ప్రభుత్వం తీరుపై విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు ఒక పరంపరలా మారాయని ఆరోపిస్తూ వైసీపీకే చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సంచలనానికి తెరలేపారు. ఈ కుట్రలపై కేంద్ర బృందాలతో దర్యాప్తు చేయాలని కోరుతూ, ఏపీలోని హిందువులను కాపాడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ బుధవారం ఒక లేఖ రాశారు. అందులోనే సీఎం జగన్‌పైనా ఫిర్యాదు చేశారు. ఇప్పుడిది రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.
సీఎం సిగ్గు పడాలి
రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసి తల తీసుకువెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ సిగ్గుపడాలని, అదే జీసస్ విగ్రహం తల నరికి ఎవరైనా తీసుకువెళితే క్షణాల్లో పట్టుకుంటారని, హిందూ దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేసినా జగన్ సర్కారు నేరస్తులను పట్టుకోవడం లేదని, తద్వారా సీఎం హిందువుల పట్ల చులకనభావం చూపుతున్నారని వైసీపీ ఎంపీ రఘురామ ఆరోపించారు. ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతోన్న తీరును, వాటికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నవారిపై బలప్రయోగం జరుగుతోందంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ ఫిర్యాదు చేశారు. ఏపీలోని హిందువులకు మోదీనే దిక్కంటూ ఆయన ప్రధానికి లేఖ రాశారు.
100కు పైగా ఆలయాల్లో దాడులు
‘‘ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. 18 నెలల కాలంలో ఏకంగా 100కుపైగా ఆలయాల్లో విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. దాడులకు గురైన ఆలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. మూడు ఆలయాల్లో రథాలను తగులబెట్టారు. రాష్ట్రంలోని హిందువులు దేవుడికి పూజలు చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఏపీ హిందువులను మీరే కాపాడాలి..” రామతీర్థం హిందువులదే కాదు..హిందూ ఆలయాలపై దాడుల పరంపరలో తాజాగా విజయనగరం జిల్లాల్లోని రామతీర్థం టార్గెట్ అయింది. ఇక్కడి కోదండరామ ఆలయాన్ని క్రీస్తుశకం 3వ శతాబ్దంలో స్థాపించినట్లు ఆనవాళ్లున్నాయి. రామతీర్థం ఆలయ పరిసరాల్లోనే బౌద్ధ, జైన మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలు కూడా ఉన్నాయి. ఇంతటి విశిష్టమైన ఆలయంలో శ్రీరాముడి విగ్రహాం శిరస్సును ఖండిచిన దుండగులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు నిరసనలకు దిగితే.. వారిపై జగన్ సర్కారు దమనకాండకు దిగుతోంది. రామతీర్థంలో దేవతా మూర్తులను ధ్వంసం చేయడంపై హిందువులు నిరసన తెలపకుండా జగన్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. అదేమంటే కరోనాను సాకుగా చెబుతున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం కొద్ది మందితో నిరసన చేస్తామన్నా అనుమతి ఇవ్వడం లేదు. మరోవైపు, సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలకు మాత్రం వేలాది మందికి రోడ్లపై ర్యాలీలు తీయడానికి అనుమతులు ఇచ్చారు. జగన్ పుట్టిన రోజుకు లేని కరోనా అడ్డు.. దేవుడి విషయంలోనే ఎందుకు ఉంటున్నదో ఆలోచించాల్సిన అంశం. ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల విధ్వంసాలపై వెంటనే కేంద్ర బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలి”అని ఎంపీ రఘురామకృష్ణంరాజు తన లేఖలో పేర్కొన్నారు. గతంలో పలు మార్లు ఎంపీ రాసిన లేఖపై ప్రధాని కార్యాలయం స్పందించిన దరిమిలా త్వరలో ఏం జరగబోతోందనేది అంతటా ఉత్కంఠ నెలకొంది.
రాములోరికి రాజకీయ రంగు
రామతీర్థంలో జరిగిన ఘటనకు రాజకీయ రంగు పులిమేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తుండటాన్ని స్థానికులు తప్పు పడుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో రాములోరి శిరస్సును ఖండించడాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఆక్షేపిస్తుంటే వైసీపీ నాయకులు దీన్ని తెలుగుదేశం కుట్రగా అభివర్ణించడం అర్థరహితమని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యమంత్రి సాక్షిగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి దీనికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయడాన్ని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఖండించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిందితులను తక్షణమే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.
కొనసాగుతున్న నిరసన
రామతీర్థంలోని రాములోరి శిరస్సును ఖండించిన దుండగులను తక్షణమే పట్టుకొని శిక్షించాలని, రాష్ట్రంలోని హిందూ దేవాలయాలకు సంపూర్ణ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు, సాధుసంతు పరిషత్ తమ నిరసన కొనసాగిస్తోంది. నిందితులను పట్టుకుని శిక్షించే వరకు, రామతీర్థం పుణ్యక్షేత్రానికి సంపూర్ణ రక్షణ కల్పించేంతవరకు తమ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.
ప్రశాంత వాతావరణానికి మారుపేరైన విజయనగరం జిల్లాలో ఇటువంటి దుర్ఘటన జరగడం, ఆందోళనలు రెకెత్తడం పట్ల స్థానికులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.