(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బొబ్బిలి వీణల తయారీ ఇకపై కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోర్సుగా రూపొందనుంది. అత్యంత చారిత్రక ప్రసిద్ధి గాంచిన బొబ్బిలి వీణకు ప్రస్తుతం దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీని తయారీ ప్రత్యేక పాఠ్యాంశంగా రూపొందింతే ఘనత మరింత ఇనుమడిస్తుంది.
నేటి తరానికి తెలిపేందుకు ..
సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బొబ్బిలి వీణల తయారీ, చరిత్ర, నేపథ్యాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు ప్రత్యేక కోర్సును కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఉప కులపతి కట్టమణి తెలిపారు. బొబ్బిలిలో వీణల తయారీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. చరిత్ర, తయారీకి వినియోగించే ముడి సరుకు, వాటి లభ్యత, అమ్మకాల వివరాలను కేంద్రం ఇన్‌ఛార్జి అచ్యుత నారాయణను అడిగి తెలుసుకున్నారు. కళాకారులతో ప్రత్యేకంగా మాట్లాడి తయారీలో ఎదురవుతున్న ఇబ్బందులు, ధరల గిట్టుబాటు వంటి అంశాలను తెలుసుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో కళాకారులు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇతర అంశాలపై చర్చించారు.
సర్టిఫికెట్ కోర్సుగా నైనా ..
కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయంలో బొబ్బిలి వీణల తయారీపై కనీసం సర్టిఫికెట్ కోర్సుగా అయినా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు ఉప కులపతి కట్టమణి తెలిపారు. హస్త కళలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా చారిత్రక ప్రసిద్ధి చెందిన వీణ ప్రాచుర్యాన్ని తెలుసుకునేందుకు ఈ కేంద్రాన్ని సందర్శించినట్లు చెప్పారు. విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి ఎన్.వి.ఎస్. సూర్యనారాయణ, పార్వతీపురం ఐటీడీఏ సహాయక ఇంజినీరు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.











