(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఈ ఏడాది కూడా శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో చందనోత్సవం నిరాడంబరంగా జరగనుంది. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది భక్తులు లేకుండానే చందనోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా అదే పరిస్థితులు నెలకొన్నాయి.
ఈనెల 14వ తేదీ (శుక్రవారం) శ్రీస్వామివారి చందనోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి రాజు , ట్రస్టు బోర్డు సభ్యులు, ఈఓ సూర్యకళ, ఆలయ అధికారులు నిర్ణయించారు. కోవిడ్ ప్రభావం, దేశంలో పరిస్థితులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం,ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు చందనోత్సవం ఏకాంతంగానే నిర్వహించనున్నారు.
సంప్రదాయం ప్రకారం..
సంప్రదాయం ప్రకారం శ్రీ స్వామివారి చందనోత్సవం రోజున అంటే (14-05-21), వైశాఖ పౌర్ణమిరోజున, జ్యేష్ఠ పౌర్ణమిరోజున, ఆషాడ పౌర్ణమి రోజున మొత్తం నాలుగు విడతలుగా స్వామివారికి చందన సమర్పణ చేస్తారు.ఈ చందన సమర్పణలో భాగస్వాములు కావాల్సిన దాతలు విరాళాలను దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ 11257208642, IFS code SBIN 0002795కు గాని పంపించవచ్చు. అర కేజీ చందనం సమర్పణ కోసం రూ.10,116, కేజీ చందన సమర్పణ కోసం రూ. 20,116 చెల్లించవలసి ఉంటుంది. డబ్బులు ఎకౌంట్లో జమ చేసిన తర్వాత తప్పకుండా దాని స్క్రీన్ షాట్ తీసి , ఈ 6303800736 నంబర్‌కు వాట్సప్ మెసేజ్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అరకేజీ చందనం సమర్పించేవారికి చందనం ముక్కలను ప్రసాదంగా పోస్టు ద్వారా అడ్రస్‌కు పంపుతారు. కేజీ చందనం సమర్పించిన వారికి అదనంగా స్వామివారి శేషవస్త్రం కూడా అందజేస్తారు. విరాళాలను ఈనెల 13వ తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది. రూ.1116 (వెయ్యి నూటపదహార్లు) శ్రీస్వామివారి చందనోత్సవ ప్రత్యేక పూజకు పంపిచే భక్తులు గోత్రనామములతో పూజలు అదేరోజు నిర్వహిస్తారు. ఆలయ అధికారులు మొత్తం చందనోత్సవ కార్యక్రమాన్ని కళ్యాణ మండపంలో నుంచి ఇచ్చే లైవ్ ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేశారు.
చందనోత్సవానికి సన్నాహాలు
శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవం కోసం చందనం చెక్కలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి నిజరూప దర్శనమైన తర్వాత సహస్ర ఘట్టాభిషేకం అనంతరం చందన సమర్పణ నిమిత్తం స్వామి వారి భాండాగారం నుంచి చందనం కర్రలు తీసుకుని …చందనం తీయడానికి అనుకూలంగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేశారు. అరగదీతకు అనుకూలంగా శుభ్రపరిచారు. చందనం సాన ముహూర్తి 7వ తేదీ నుంచి చందనం తీయడం ఆరంభమవుతుంది. ఈ ప్రక్రియ ఐదారు రోజులపాటు జరగనుంది. సుమారు 120 కేజీల చందనంలో సుగంధద్రవ్యాలను మిళితం చేసి స్వామివారికి సమర్పించనున్నారు.











