చిత్తూరు జిల్లా పుంగనూరు రణరంగంపై తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును బాధ్యుడును చేయాలని పోలీసులు దొంగ సాక్ష్యాలను సృష్టించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
సాగునీటి ప్రాజెక్ట్ ల విధ్వంసం పై తెలుగు దేశం పార్టీ అధినేత.., మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యుద్ధభేరిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు వస్తున్న ఆయనను లారీలు అడ్డుపెట్టి వైసీపీ మూకలు అడ్డుకున్నాయి. దీంతో జరిగిన విధ్వంసానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని సాక్ష్యాలను సృష్టించాలని పోలీసులు విఫలయత్నం చేశారు. టీడీపీ శ్రేణులపై.., పోలీసులపై రాళ్ళతో దాడి చేసింది.., పలు వాహనాలకు నిప్పు పెట్టింది.., ఈ విధ్వంసానికి కారణం చంద్రబాబే అని క్రియేట్ చేయాలని చూసిన పోలీసులకు వారి పాచికలు పారలేదు. ప్రశాంత వాతావరణంలో యుద్ధభేరి కార్యక్రమం పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్న చంద్రబాబుపై దాడికి తెగబడి.. అదేదో ఆయనే ప్రోత్సహించారు అన్న విధంగా అక్రమంగా సాక్ష్యాలు సృష్టించి జైలుకు పంపాలని మంత్రి పెద్దిరెడ్డి పథక రచన పెద్దగా పారలేదనే చెప్పాలి.
పుంగనూరు ఘటనపై పోలీసు కష్టడిలో ఉన్న పుంగనూరు టీడీపీ నియోజకవర్గం ఇన్ చార్జి చల్లా రామచంద్రారెడ్డి పై పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు. పుంగనూరు ఘటన చంద్రబాబు ప్రోద్బలం, ఆదేశాలు మేరకే జరిగిందని సంతకం చేయాలని పోలీసులు నానావిధాలుగా చల్లా రామచంద్రారెడ్డిను బెదిరించారు. ఆ సంతకం చేసే వరకు వదిలేది లేదని స్టేషన్ లో ఉంచి చిత్ర హింసలకు గురిచేశారు. కోర్టుకు హాజరుపర్చకుండా పోలీసులు చేస్తున్న జాప్యంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో పుంగనూరు పోలీసు స్టేషన్ వద్ద హైడ్రామా నెలకొంది.
పుంగనూరు ఘటనలో టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి తోపాటు మరో 67 మందిపై పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఎదరు లొంగిపోయారు. అయితే.., చల్లా తో సహా 67 మంది టీడీపీ నేతలను.., కార్యకర్తలను మధ్యాహ్నం 3 గంటల్లోపు పుంగనూరు కోర్టులో హాజరు పరుస్తామని చెప్పి.. కొందరిని మాత్రమే కోర్టుకు హాజరుపరిచారు. ఈ క్రమంలో చల్లా తో సహా మరికొందరిని స్టేషన్ లో ఉంచి.. పుంగనూరు ఘటనకు కారణం చంద్రబాబేనని స్టేట్ మెంట్ తయారు చేసి దానిపై సంతకం చేయాలని ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారు పోలీసులు. అయితే తప్పుడు స్టేట్ మెంట్ పై తాను సంతకం చేయనని.., చేయని నేరం అంగీకరించే ప్రశక్తే లేదని తేల్చి చెప్పడంతో చల్లాను కోర్టుకు హాజరుపర్చడంలో తీవ్ర జాప్యం చేశారు పోలీసులు.
విషయం తెలుసుకున్న అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి.., చల్లా సోదరి వీణ, భార్య సుప్రియలు స్టేషన్ వద్దకు చేరుకుని.. అక్కడున్న మీడియాకు స్టేషన్ లోపల జరుగుతున్న కుట్రను బయటపెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి డైరెక్షన్ మేరకే పోలీసులు చల్లాపై ఒత్తిడి తీసుకొచ్చి స్టేట్ మెంట్ పై సంతకాలు చేయిస్తున్నారని వారు ఆరోపించారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన పోలీసులు ఆగమేఘాలపై తెల్లవారు జామున 3 గంటలకు పుంగనూరు జడ్జీ సిందూ ఎదుట హాజరు పరిచారు. అనంతరం చల్లాను, నిందుతులుగా చూపిన 67 మంది టీడీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు కడప సెంట్రల్ జైలుకు రిమాండ్ కు తరలించారు. అలా హైడ్రామా నడుమ చంద్రబాబును పుంగనూరు కేసులో ఇరికించాలని మంత్రి పెద్దిరెడ్డి ప్లే చేసిన కుట్రను టీడీపీ నేతలు తిప్పికొట్టారు.