భారత రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక అధికారాలున్నయన్న మాట తెలిసిందే. ఆ అధికారాల పరిధి, వాటి ద్వారా తీసుకునే చర్యలు ఏ రీతిన ఉంటాయన్న విషయం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోమారు రుచి చూపించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిన మరుక్షణమే… తన విచక్షణాధికారాలను అమలులో పెట్టిన నిమ్మగడ్డ ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేసి పారేశారు. అంతేకాకుండా గతంలో ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు సహకరించిన 9 మంది అధికారులు… వారిలో ఇద్దరు జిల్లా కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలతో పాటు మరో ఐదుగురు పోలీసు అధికారులపై కూడా వేటు పడేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్‌లలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ లున్నారు. మంగళవారం ఉదయంలోగా చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లు నారాయణ్ భరత్ గుప్తా, శ్యామ్యూల్ ఆనంద్‌లతో పాటు తిరుపతి అర్బన్ ఎస్పీ సహా గతంలో ఎస్ఈసీ వేటు వేసిన 9 మంది అధికారులు బదిలీ అవక తప్పని పరిస్థితి నెలకొంది.
Also Read ;- నిమ్మగడ్డ చెప్పినట్లే ఎన్నికలు జరుగుతాయి : సజ్జల
నిమ్మగడ్డతో సమావేశానికి వెళ్లని కారణంగా..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్వయం ప్రతిపత్తి కలిగిన ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేయకుండా జగన్ ప్రభుత్వం చెప్పినట్లుగా నిమ్మగడ్డతో సమావేశానికి వెళ్లని కారణంగా ద్వివేది, గిరిజా శంకర్ లపై వేటు పడటం ఖాయమేనన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే రంగంలోకి దిగిపోయిన నిమ్మగడ్డ… ఎన్నికల షెడ్యూల్‌ను రీషెడ్యూల్ చేసిన మరుక్షణమే తన ఆదేశాలు పక్కన పెట్టేసిన ద్వివేది, గిరిజా శంకర్ లను బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా వారి స్థానంలో ముగ్గురు అధికారుల చొప్పున ప్రతిపాదనలు పంపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు అందుకున్న మరుక్షణమే ద్వివేది, గిరిజా శంకర్‌లను ఆయా స్థానాల నుంచి తొలగించిన సీఎస్.. వారి స్థానంలో కొత్తగా నియమించదలచిన అధికారుల కోసం మొత్తం ఆరుగురు అధికారుల పేర్లతో ఓ జాబితాను కూడా ఎస్ఈసీకి పంపారు. దీంతో నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేసిన క్షణాల్లోనే ద్వివేది, గిరిజా శంకర్ లు బదిలీ అయిపోయారు.
9 మంది అధికారులు కూడా..
ఇదిలా ఉంటే… గతంలో ఎన్నికల్లో అక్రమాలను ప్రోత్సహించారని ఆరోపణలు ఎదుర్కొన్న చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ సహా 9 మంది అధికారులను కూడా తక్షణమే బదిలీ చేయాలని, ఆయా స్థానాల్లో కొత్తగా నియమించే వారి జాబితాను కూడా పంపాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను కూడా జగన్ సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందే. వెరసి మంగళవారం ఉదయంలోగా చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ పోస్టులతో పాటు మిగిలిన ఆరు పోస్టుల్లో కొత్త వారిని ఎంపిక చేసి సదరు జాబితాను జగన్ సర్కారు.. ఎస్ఈసీకి పంపనుంది. అంటే… సుప్రీంకోర్టులో ఎన్నికల ప్రక్రియకు అడ్డంకులు తొలగిన మరక్షణమే మొత్తం నలుగురు ఐఏఎస్‌లు, ఓ ఐపీఎస్ సహా పలువురు పోలీసు అధికారులు బదిలీ అయిపోయారన్న మాట. ఇక ఎన్నికల నిర్వహణలో జగన్ సర్కారు ఏమాత్రం తోక జాడించినా… నిమ్మగడ్డ తన కత్తిని బయటకు తీస్తూనే ఉంటారన్న మాట.
Also Read ;- ఆడు మగాడ్రా బుజ్జీ : నాడు శేషన్.. నేడు నిమ్మగడ్డ!