ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ మండలాల ప్రజలు సర్వం త్యాగం చేశారు. ఇల్లు, పొలం సహా ఉన్నదంతా వదులుకుని ఇరత ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. అలాంటి వారికి పునరావాస కాలనీలను నిర్మించే బృహత్కార్యాన్ని తన భుజాలకెత్తుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు… ఏపీ సీఎం హోదాలో తన తొలి టెర్మ్ లోనే ఓ భారీ అడుగు వేశారు. వరసగా రెండో దఫా కూడా ఆయనకే అధికారం అంది ఉంటే… పోలవరం నిర్వాసితులు ఏళ్ల తరబడి పునరావాసం కోసం వేచి చూడాల్సిన పని తప్పేది.
ఒక్క ఛాన్స్ అంటూ జనాన్ని మాయ చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడచిన ఐదేళ్ల పాటు వారికి చుక్కలు చూపారు. పరిహారం నిధులు అదుగోఇదుగో అంటూ వారితో ఆటలు ఆడుకున్నారు. పోలవరం నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిన జగన్… నిర్వాసితుల విషయంలోనూ అదే పంథాను కొనసాగించారు.
రెండో దఫా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి ఆరు నెలల వ్యవధిలోనే పోలవరం నిర్వాసితులకు పరిహారాన్ని అందించారు. వ్యక్తిగత నష్ట పరిహారంతో పాటుగా ఇళ్లు, పొలాలు వద్దనుకున్న వారికి వాటికి సంబంధించిన పరిహారాన్ని కలిపి మొత్తం పరిహారాన్ని బాధితులకు అందజేస్తూ చంద్రబాబు సర్కారు గురువారమే కీలక నిర్ణయం తీసుకోగా… శుక్రవారం ఉదయం నుంచి నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం సొమ్ము జత కావడం మొదలైైంది. 10 వేలకు పగా నిర్వాసితులకు అన్నీ కలిపి రూ.1,000 కోట్ల మేర పరిహారాన్ని కూటమి సర్కారు వారి ఖాతాల్లో జమ చేసింది.
ఫలితంగా ఏళ్ల తరబడి పరిహారం కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిర్వాసితులు ఇప్పుడు చంద్రబాబు చూపిన ఉదారతను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జగన్ తమ పట్ల చూపిన నిర్లక్ష్యాన్ని గుర్తు చేసుకుని శాపనార్ధాలు పెడుతున్నారు. జగన్ ఆర్భాటానికి మాత్రమే పరిమితమైతే… చంద్రబాబు తన పనితనాన్ని చూపి తమను ఆదుకున్నారని వారు సంతోషం వ్కక్తం చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏలూరు జిల్లా పోలవరం, కుక్కునూరు,. వేలేరుపాడు మండలాలతో పాటు అల్లూరి జిల్లాలోని దేవీపట్నం, వీఆర్ పురం, చింతూరు, ఏటపాక, కూనవరం మండలాల్లోని 10 వేల మంది తమ సర్వస్వాన్ని వదులుకున్నారు. ప్రాజెక్టు వల్ల రాష్ట్రాన్ని కలిగే ప్రయోజనాలను నాటి చంద్రబాబు ప్రభుత్వం వివరించగా… ఎలాంటి ప్రతిఘటన లేకుండానే… తమ ఊళ్లను ఖాళీ చేసేందుకు వారు అంగీకరించారు. వీరి త్యాగాలను గుర్తు చేసుకున్న చంద్రబాబు… నాడు పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తూనే… నిర్వాసితులకు పునరావాస కాలనీల ఏర్పాటు పనులకూ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. చాలా కాలనీలు చంద్రబాబు తొలి టెర్మ్ లోనే పూర్తి అయ్యాయి కూడా. వాటిలో ఇతరత్రా సౌకర్యాలను ఏర్పాటు చేసే పనుల్లోనూ మెజారిటీ పూర్తి కాగా… నిర్వాసితులకు పరిహారం పంపిణీ మాత్రం పూర్తి కాలేదు.
2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్…2022లోగానే పరిహారం నిధులను అందజేస్తానంటూ బీరాలు పలికారు. అయితే ఆ దిశగా ఆయన చర్యలే చేపట్టలేదు. అప్పటిదాకా పోలవరం నిర్మాణంలో చంద్రబాబు సర్కారు చూపిన చొరవ, స్పీడును ఒక్క దెబ్బతో తగ్గించేసిన జగన్… చంద్రబాబు హయాంలో జరిగిన పనుల్లో తప్పులు ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో పోలవరం పనులు పూర్తిగా పడకేయగా… నిర్వాసితులకు పరిహారం పంపిణీని జగన్ పూర్తిగా విస్మరించారు.
గడచిన ఐదేళ్లుగా జగన్ పరిహారం ఇస్తారని నిర్వాసితులు ఎదురు చూశారు తప్పించి… వారి ఆశలు అడియాశలే అయ్యాయి. అయితే చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చినంతనే… పోలవరం పనుల్లో తిరిగి ఫుల్ స్పీడును పెంచేశారు. అదే సమయంలో జగన్ మాదిరిగా కాకుండా… నిర్వాసితుల త్యాగాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ కేవలం 6 నెలల వ్యవధిలోనే వారికి పరిహారం నిధులను అందజేశారు.