2019 ఏపీ ఎన్నికలకు ముందు బాగా వినిపించిన రిటర్న్ గిఫ్ట్ అనే పదం మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని 2018 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయగా, ఏపీలో చంద్రబాబుకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏపీలో వైఎస్ఆర్ సీపీకి బహిరంగ మద్దతు ఇవ్వడం.. అక్కడ జగన్ పార్టీ అధికారంలోకి రావడం జరిగాయి. దీంతో చంద్రబాబుకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ కేసీఆర్ కాలర్ ఎగరేసుకొని మరీ చెప్పారు.
కట్ చేస్తే ఐదేళ్ల తర్వాత ఇప్పుడు పరిస్థితులు తారుమారు అవ్వబోతున్నట్లుగా తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఆనాడు చంద్రబాబును ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్ కే.. ఇప్పుడు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకోవడానికి, బీఆర్ఎస్ అధికారాన్ని ఊడగొట్టడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారనే టాక్ నడుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో ముందుగానే టీడీపీ బరి నుంచి తప్పుకోవడం కాంగ్రెస్‌కు ఎనలేని లాభాన్ని చేకూర్చినట్లు అయింది.
ఐదేళ్ల క్రితం చంద్రబాబు విషయంలో కేసీఆర్ ఎంత అహంకారం ప్రదర్శించారో చెప్పనవసరం లేదు. 2018లో వారికి తెలంగాణలో 88 సీట్లు రావడంతో ఇక తమకు తిరుగేలేదన్నట్లుగా గర్వంతో వ్యవహరించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే.. వారిపై ప్రతి విషయంలోనూ తామే పైచేయి సాధించవచ్చనే అభిప్రాయం కూడా కేసీఆర్ లో ఉండేది. మొత్తానికి ఐదేళ్లలో పరిస్థితులు తారుమారు అయిపోయి.. అప్పట్లో చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్‌కి.. ఇప్పుడు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి ఎదురయింది. దీంతో కేసీఆర్ దేశరాజకీయాల ఆశ కలగానే మిగిలిపోబోతోంది.











