తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కలే అంటూ ప్రముఖ సర్వే సంస్థలన్నీ తేల్చేశాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. వాటిలో ఆరా సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ కూడా ఇదే విషయాన్ని అంచనా వేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ ను సాధిస్తుందని ఆరా సంస్థ అంచనా వేసింది.
ఆరా సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 58 నుంచి 67 స్థానాలను గెలవవచ్చు. బీఆర్ఎస్ మాత్రం 41 నుంచి 49 స్థానాలకే పరిమితం కానుంది. బీజేపీ 5 నుంచి ఏడు స్థానాలు, ఎంఐఎం సహా ఇతరులు ఏడు నుంచి 9 స్థానాలు కైవసం చేసుకోవచ్చని ఆరా మస్తాన్ ప్రకటించారు.
అయితే, ఆయన తెలిపిన అంచనాల ప్రకారం.. డిసెంబర్ 3న వెలువడే ఎన్నికల ఫలితాల్లో నిజంగానే బీఆర్ఎస్ ఓడితే అందుకు ప్రధాన కారకుడు కేటీఆరే అవుతారని ఆరా మస్తాన్ తేల్చి చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆరా మస్తాన్ ప్రెస్ మీట్ పెట్టి ఈ కీలక వివరాలు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధితో పాటుగా చుట్టుపక్కల నియోజకవర్గాలు, ఇంకా తెలంగాణలో నివాసం ఉంటున్న ఏపీ మూలాలు ఉన్నవారి ఓట్లు చాలా ప్రభావం చూపాయని ఆరా మస్తాన్ అంచనా వేశారు.
ఎందుకంటే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ ఏపీ సెటిలర్లల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయని మస్తాన్ అభిప్రాయపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను వారు ఆయన అహంకారంగా తీసుకున్నారని, అదే బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పని చేయడానికి వారిని పురిగొల్పిందని విశ్లేషించారు. బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద తప్పుల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒకటని మస్తాన్ అన్నారు











