ఏపీలో వైసీపీ పాలన మొదలయ్యాక పైరవీలు ఓ రేంజికి చేరిపోయాయన్న వాదనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటన ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోందని చెప్పాలి. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద సంఖ్యలో బరిలోకి దిగిన దళారులు నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. ఇలాంటి ఓ భాగోతంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం పేరు వినిపించడం కలకలం రేపుతోంది.
ఈ విషయంపై స్వయంగా అజేయ కల్లమే నేరుగా డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేయడం, సదరు ఫిర్యాదుపై వేగంగా స్పందించిన పోలీసులు కేసులు నమోదు చేయడం, ఆ వెంటనే ఈ మొత్తం భాగోతానికి కారకులంటూ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. మొత్తంగా ఈ వ్యవహారంలో సీఎం చీఫ్ అడ్వైజర్ పేరు బయటకు రావడం, దీని కథేంటో తేల్చాలని అజేయ కల్లమే నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం నిజంగానే పెను కలకలం రేపుతోంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు కేంద్రంగా రంగంలోకి దిగిన ఓ ముఠా జూనియర్ లైన్ మన్ పోస్టులు భర్తీ అవుతున్నాయని, తాము ఆ పోస్టులను ఇప్పిస్తామని, తమకు నేరుగా అజేయ కల్లంతోనే సంబంధాలున్నాయని ప్రచారం మొదలెట్టేశారు. సీఎం చీఫ్ అడ్వైజర్ అజేయ కల్లం అండ ఉన్న వారే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రంగంలోకి దిగితే… నిరుద్యోగులు ఈజీగానే నమ్మేస్తారు కదా. అలాగే ఈ ముఠా బుట్టలో ఇప్పటికే చాలా మంది పడిపోయారు. అంతేకాకుండా జూనియర్ లైన్ మన్ పోస్టులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామని సదరు ముఠా చెప్పడంతో మరింత మంది ఆ ముఠా బుట్టలో పడిపోయారు.
మొత్తంగా చాలా మందికి ఈ విషయం తెలియడంతో తమకు తెలిసిన వారందరికీ ఈ సమాచారం చేరవేయాలన్న భావనతో నిరుద్యోగులు ఈ విషయాన్ని వాట్సాప్ లోకి ఎక్కించేశారు. చూస్తుండగానే ఈ వ్యవహారం రాష్ట్రమంతా పాకిపోయింది. వైసీపీ నేతలకూ తెలిసిపోయింది. చివరకు అజేయ కల్లం కూడా ఈ విషయం తెలుసుకుని షాక్ తిన్నారట. అయితే ఈ విషయంపై ఏమాత్రం తాత్సారం చేసినా తన పరువుకే భంగం వాటిల్లుతుందని గ్రహించిన కల్లం.. నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అజేయ కల్లం నుంచి అందిన ఫిర్యాదును డీజీపీ గుంటూరు అర్బన్ పోలీసులకు ఫార్వార్డ్ చేయగా… మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏకంగా సీఎం చీఫ్ అడ్వైజర్ పేరుతో ప్రమేయం కలిగిన పైరవీలు కావడం, నేరుగా అజేయ కల్లమే ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేగంగా స్పందించారు. వాట్సాప్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు… ఈ మొత్తం వ్యవహారానికి కీలక బాధ్యులుగా గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, నేటి ఆంధ్రా.కామ్ నిర్వాహకుడిని గుర్తించారు.
ఇదే విషయంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వద్ద సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్న మేకా వెంకటరామిరెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారట. మొత్తంగా పైరవీల రచ్చలోకి ఏకంగా సీఎం చీఫ్ అడ్వైజర్ నే లాగేసిన ముఠాకు టీడీపీకి చెందిన ఓ నేత నేతృత్వం వహిస్తున్నారన్న విషయం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారిపోయింది.
ఇరికించారని అంటున్నారు..
www.netiandhra.com వెబ్ సైట్ పేరు కూడా ఈ వ్యవహారంలో బయటకు వచ్చింది. ఆ సైట్ వారిపై కూడా కేసు నమోదు అయింది. అయితే ఆ వెబ్ సైట్ మాత్రం.. అనవసరంగా ఇరికించారని అంటున్నారు. తప్పుచేసిన వారే.. తెలుగుదేశానికి ముడిపెట్టేలా.. నిందలు వేస్తున్నారని ఆరోపిస్తూ ఆ వెబ్ సైట్ లో ఒక కథనం వచ్చింది. ఆ కథనాన్ని ఇక్కడ చదవొచ్చు.