తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చివేసిన ఘటనపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోడ కూల్చివేత, బీసీలపై దాడులు, హత్యలను నిరసిస్తూ ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి టీడీపీ శ్రేణలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ దీక్షకు దిగారు. తమ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన దీక్షకు కూర్చున్నారు.
మరోవైపు విజయ్ చేపట్టిన పోరాటానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి నర్సీపట్నం బయల్దేరిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నర్సీపట్నంకు వెళ్లకుండా తణుకులో మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణను, వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని హౌస్ అరెస్ట్ చేశారు.
కాగా, అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీని మునిసిపల్ అధికారులు అర్ధరాత్రి కూల్చివేయడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిణ సంగతి తెలిసిందే.తమ ఇంటి ప్రహరీ కూల్చివేతను నిలువరించాలని కోరుతూ అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్, రాజేశ్ నిన్న హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిగిన న్యాయస్థానం కూల్చివేత ప్రక్రియలో ముందుకెళ్లొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు చేపట్టేందుకు వీల్లేదంటూ న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఆదేశమేమాలో ఇదేం పనంటూ అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసింది.