పరీక్ష రాసిన 25 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వరించింది. కానీ ఆ కొలువు వచ్చే సరికి ఆయన వయసు 57 ఏళ్ళుకి చేరుకుంది. దీంతో ఆయన పరిస్థితి నవ్వాలో ఏడవాలో తెలియనట్లుగా తయారయ్యింది. టీచర్ కావాలన్న తన కల ఎట్టకేలకు నెరవేరినా అది శూన్యమే అన్నట్లుగా కనిపిస్తోంది. న్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగానికి అర్హత సాధించినా అందని ద్రాక్షగా మారి ఊహించని మలుపులు తిరిగిన ఆ వ్యక్తి కథ అందరినీ కన్నీళ్ళు పెట్టిస్తోంది.
అల్లక కేదారేశ్వర రావు.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని సీది గ్రామానికి చెందిన వ్యక్తి.తల్లిదండ్రులు చేనేత కార్మికులు. ఈ క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులు తమ బిడ్డలు పడకూడదు అనుకున్న ఆ పెద్దలు కేదారేశ్వర రావును బాగానే చదివించారు.కేదారేశ్వర రావుకు సైతం చిన్నప్పటి నుంచి చదువంటే మక్కువ.ఈ క్రమంలోనే పెద్దయ్యాకా టీచర్ కావాలన్న కోరికతో కేదారేశ్వర రావు బీఈడీ పూర్తిచేశాడు.
ఇక 1994 డీఎస్సీలో రాయగా ఆయన స్వల్ప తేడాతో ఉద్యోగం కోల్పోయారు.మళ్ళీ 1998లో డీఎస్పీ రాసి క్వాలిఫై అయినా ఆ డీఎస్సీ వివాదాలతో నిలిచిపోయింది.దీంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కేదారేశ్వర రావు చేసిన ప్రయత్నం తృటిలో తప్పిపోయినట్లు అయ్యింది.ఈ నేపధ్యంలో మంచి చదవు, వాగ్దాటి, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం ఉన్నా.. ఆయన మాత్రం ఉద్యోగం చేజారిపోవడంతో నిరాశలోకి వెళ్లిపోయారు.ఇక ఉద్యోగం రాదని భావించిన ఆయన.. తన కులవ్రత్తి వైపు అడుగులు వేసి సైకిల్‌పై చేనేత వస్త్రాలు విక్రయించడం ప్రారంభించారు. అది కేదారేశ్వర రావుకు పెద్దగా కలిసి రాలేదు.ఇంతలోనే ఆయన జీవితంలో మరో విషాదం చోటుచేసుకుంది.కేదారేశ్వర రావు తల్లిదండ్రులు చనిపోయారు.ఆయన ఉన్న మానసిక స్థితి చూసి తోబుట్టువులు కూడా ఈయనను దూరం పెట్టారు.దీంతో ఆయన కడుపు నింపుకొనేందుకు పాతపట్నం పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు.
కట్ చేస్తే సీన్ ఒక్కసారిగా మారిపోయింది.25 ఏళ్లుగా సుదీర్ఘంగా సాగిన 1998 డీఎస్సీ పోరాటానికి కోర్టు చిక్కుముడులు వీడాయి.అప్పుడు క్వాలిఫై అయిన వారికి అనుకూలంగా కోర్టు ఆదేశాలు వచ్చాయి.దీంతో అర్హత సాధించిన పాతికేళ్ళ తర్వాత కేదారేశ్వర రావుకు ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగం.. అది కూడా ఆయనకు ఇష్టమైన టీచర్ కొలువు వచ్చింది.ఈ విషయాన్ని గ్రామానికి చెందిన యువకులు ఆయనకు చేరవేశారు. కానీ ఇప్పుడు ఆయన వయస్సు 57 ఏళ్లు. అంటే గట్టిగా పదేళ్ళు కూడా ఉద్యోగం చేయకుండానే ఆయన రేటైర్ అవ్వాలి. దీంతో ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఆయనలో ఎక్కడా కనిపించని పరిస్థితి.
మొత్తం మీద చదువున్నా చిన్నపాటి వివాదం, సమయానికి అందని న్యాయం కేదారేశ్వర రావు జీవితాన్ని తలకిందులు చేసింది.