(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
సీనియర్ రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ మూలాలు తెలిసిన వ్యక్తి, రాజకీయ అపర చాణక్యుడుగా పేరున్న ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనకు రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా స్థానం లభిస్తుందని ఆశించారు. అధికార పార్టీ ఆయనను స్పీకర్‌గా ఎంపిక చేసింది. అందువల్ల ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి అవ్వడంతో కొంత అసహనానికి గురవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ ఆయన రాష్ట్ర రాజకీయాలపై అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. అంతేకాకుండా రాబోయే కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకునేందుకు తనదైన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనకు వచ్చే మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందా అనేది ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది.
తమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే ..
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కొన్నాళ్లుగా వైసీపీ నేతల్లో వినిపిస్తున్న మాట. దీనికి కారణం.. ఆయన రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ పదవిలో ఉండి రాజకీయాలను మాట్లాడలేకుండా ఉండడమే! గతంలోనూ చంద్రబాబు హయాంలో మంత్రి పదవిని అలంకరించిన ఆయన.. గత ఏడాది ఎన్నికల్లో చాలా ఏళ్ల విరామం తర్వాత నెగ్గిన నేపథ్యంలో బీసీ కోటాలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, జగన్ ఆయనకు స్పీకర్ పదవిని కట్టబెట్టారు. సీనియర్ నాయకుడు.. టీడీపీ మూలాలు తెలిసిన నేత .. అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు కూడా కావడంతో ఆయనకు స్పీకర్ స్థానాన్ని అప్పగించారు.
Must Read ;- వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నాట్ట! ఎందుకో తెలుసా?
అసహనానికి కారణం అదేనా ..?
తమ్మినేని కోరుకుంది ఒకటి.. దక్కింది మరొకటి కావడంతో తమ్మినేనిలో అప్పుడప్పుడు .. అసహనం పెల్లుబుకుతూనే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు తనను కాదని, తనకు పోటీగా ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన మేనల్లుడు(కూన రవి)ని ప్రోత్సహించడంపై ఇప్పటికీ తమ్మినేనిలో ఆగ్రహం ఉంది. దీంతో మంత్రి పదవి ఇస్తే టీడీపీని బాగా ఇరుకున పెట్టేవాడినని ఆయన భావనగా తెలుస్తోంది. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్నప్పటికీ ఆయన తరచుగా టీడీపీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో అయినా తనకు మంత్రి పీఠం దక్కుతుందనేది ఆయన ఆలోచనగా ఉందని శ్రీకాకుళం వైసీపీ నాయకులు చెబుతున్నారు.
జగన్ కోరిక కూడా ..
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా ఇలాంటి నాయకులనే కోరుకుంటున్నారు కాబట్టి తమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వడాన్ని వైసీపీ నాయకులు కూడా సమర్థిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, రెండోవారు ఇటీవలే మంత్రి పదవిని చేపట్టిన పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు. వీరిద్దరూ కూడా జగన్‌కు అత్యంత సన్నిహితులుగా పేరు పొందారు. పైగా ఏరికోరి ధర్మానను డిప్యూటీ సీఎంను చేశారు. అందువల్ల ఆయనను అతి తక్కువ సమయంలోనే అంటే వచ్చే ఏడాది పునర్వ్యస్థీకరణలోనే పక్కన పెట్టే సంకేతాలు కనిపించడం లేదని సంబంధిత వర్గాల సమాచారం. అలాగని నిన్న గాక మొన్న మంత్రి పదవిని చేపట్టిన సీదిరి అప్పలరాజును పక్కన పెడతారా? అంటే అది కూడా సాధ్యం కాదనే భావన పార్టీలో వినిపిస్తోంది. పోనీ ఈ రెండు మార్గాలను వదిలేసి.. ఒకే జిల్లా నుంచి ముగ్గురిని మంత్రులుగా తీసుకుంటారా? అంటే అది జరిగే పనికాదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి.
ఈ క్రమంలో వచ్చే కేబినెట్ విస్తరణలో జిల్లా నుండి ఎవరు బలవుతారు? అనే ప్రశ్న శ్రీకాకుళం పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. తమ్మినేనికి మంత్రిపదవి ఇవ్వడం ఖాయమనే వాదన ఎంత నిజమో.. ఎవరు బలవుతారో? అనేది అంతే సందేహంగా ఉండడం ఇక్కడ గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also Read ;- జగన్‌ని టిడిపి నెటిజన్స్ అంత మాట అన్నారేంటీ?