దుబ్బాక ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోలీంగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార హోరుతో అభ్యర్థులు అమీతుమీ తేల్చుకుంటున్నారు. అయితే కత్తీ కార్తీకకు టిఆర్ఎస్ నాయకులు ఒక విషయంలో ప్రధానంగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 52 ఎకరాల స్థలాన్ని రూ.35 కోట్లకే ఇప్పిస్తానని రూ. కోటి అడ్వాన్స్‌గా తీసుకుని మోసానికి పాల్పడినట్లు కత్తి కార్తీకతోపాటు ఆరుగురిపై బంజారాహిల్స్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. అయితే దీనిని సాకుగా చూపి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో కత్తి కార్తీకపై కొందరు టిఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఆమెకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నట్లు తెలిసింది.
ఇదీ విషయం..
మెదక్ జిల్లా అమీన్‌పూర్ గ్రామంలో 322, 323, 324, 329లలో 52 ఎకరాల స్థలం ఉందని, అందులో కొంత స్థలం తమదేనని, మిగతా స్థలం తాలూకు పత్రాలు, జిపిఏ హక్కులు తమ వద్దనే ఉన్నాయిని కత్తి కార్తీక బృందం చెప్పింది. దీంతో 52 ఎకరాలను రూ.35 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుని దొరస్వామి నుంచి రూ.కోటి అడ్వాన్స్‌గా తీసుకుంది. అయితే అసలు నిజం తెలుసుకుని బాదితుడు దొరస్వామి కంగుతిన్నారు. ఆ స్థలం సిప్లా రమేష్ అనే వ్యక్తిదని తెలుసుకున్న దొరస్వామి మోసపోయానని గ్రహించి కత్తి కార్తీక, శ్రీధర్ గోపిశెట్టి, మురళీకృష్ణ, నువ్వాల శివరాంప్రసాద్, తెన్నేరి భీమ్‌సేన్ తదితరులపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు.
ఇది ఇలా ఉంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, ఇండిపెండెంట్‌గా కత్తి కార్తీక, బిజెపి అభ్యర్థిగా రఘునందన్‌రావు దుబ్బాక ఎన్నికల బరిలో నిలిచారు.











