Chiranjeevi Team Meeting With CM YS Jagan :
ప్రభుత్వానికీ సినీ పరిశ్రమకూ మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో మంత్రి పేర్ని నాని క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 4వ తేదీన సీఎం జగన్ తో సినీ ప్రముఖులు భేటీ కావలసి ఉంది. ఎందుకోగానీ ఆ భేటీ జరగలేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోసం కోసం చిరంజీవి బృందం కూడా ఎదురుచూస్తోంది. ఈలోపే ప్రభుత్వం నుంచి ఆన్ లైన్ టిక్కెటింగ్ కు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. చిత్ర రంగ ప్రముఖులతో చర్చించిన తర్వాత ఈ ఉత్తర్వులు వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం కూడా ఉంది. ఏమైతేనేం సీఎంతో భేటీకి రంగం సిధ్ధమైంది.
ఈ నెల 20 వ తేదీన చిత్ర ప్రముఖులను పిలవాల్సిందిగా ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నుంచి కబురందింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ భేటీలో సీఎం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. థియేటర్ల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. నూటికి నూరుశాతం ఆక్యుపెన్సీతో ఈ నెల 24 నుంచి థియేటర్లు ప్రారంభం కానున్నాయి. దాంతో పెద్ద సినిమాలన్నీ విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. మొదటగా నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ విడుదలకాబోతోంది.
పెద్ద హీరోలు నటించిన కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకోడానికి అనుమతిని కూడా ఆరోజు సీఎంను కోరనున్నారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, సురేష్ బాబు, దిల్ రాజు తదితరులు సీఎంను కలవనున్నారు. నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు ఆటలు ప్రద్శిర్శించుకునే వెసులుబాటు కల్పించాలని, గ్రేడ్ 2 కేంద్రాలలో నేల టిక్కెట్టుకు రూ. 10, కుర్చీకి రూ. 20 వసూలు చేసే విధానాన్ని వర్తింపజేయాలని కూడా కోరనున్నారు.ప్రభుత్వం నేరుగా టిక్కెట్లు విక్రయించే విధానానికి స్వస్తిచెప్పాల్సిందిగానూ ఈ బృందం కోరనుంది. దీని వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఎలాంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్న దాని మీద కూడా కసరత్తులు చేస్తున్నారు.











