పై ఫొటోలో కనిపిస్తున్న ప్రధాన నరేంద్ర మోదీ విగ్రహం అలా బ్లాక్ గా, దుమ్ము పట్టినట్టుగా కనిపిస్తోందేమిటా? అని చూస్తున్నారా? విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఆలనాపాలనా లేకుంటే ఇలా మారిపోక ఇంకెలా ఉంటుందని అనుకుంటున్నారా? అదేమీ లేదండీ బాబూ.. ఆ విగ్రహమే అంత. మొత్తం ఇనుప తుక్కు (స్క్రాప్).. అది కూడా ఆటోమోబైల్ స్క్రాప్ తో చేసిన విగ్రహం ఇది. ఇంకా ఎక్కడా ప్రతిష్టించలేదు. త్వరలోనే బెంగళూరులో ఈ విగ్రహం అలా ఠీవీగా నిలబడుతుందట. మరి ఇప్పుడు ఎక్కడ ఉందంటారా? ఎక్కడో కాదు.. మన తెలుగు నేలలోనే. నవ్యాంధ్రలోని గుంటూరు జిల్లా తెనాలిలో ఈ విగ్రహం ఉంది. తెనాలిలోనే తయారైంది. తెనాలికి చెందిన శిల్పి కె.వెంకటేశ్వరరావు.. శిల్ప కళలో తనను మించిపోయిన తన కుమారుడు రవిచంద్రతో కలిసి ఈ విగ్రహాన్ని తయారు చేశారు.
నేపథ్యం ఇదీ
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది కదా. బెంగళూరు నగర పాలక సంస్థలో కూడా బీజేపీనే జయకేతనం ఎగురవేసింది కదా. బెంగళూరుకు చెందిన బీజేపీ కార్పొరేటర్ మోహన్ రాజు.. స్క్రాప్ తో అది కూడా ఆటోమోబైల్ స్క్రాప్ తో మోదీ నిలువెత్తు విగ్రహాన్ని తన ప్రాంతంలో పెట్టాలని అశ పడ్డారు. ఇలా స్క్రాప్ తో మోదీ నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేసేవారు ఎక్కడున్నారన్న విషయంపై పరిశోధన చేసిన మోహణ్ రాజుకు తెనాలిలోని వెంకటేశ్వరరావు, రవిచంద్రల విషయం తెలిసిందట. ఇంకేముంది వారిద్దరినీ కలిసిన మోహన్ రాజు.. స్క్రాప్ తో మోదీ విగ్రహాన్ని రూపొందించాలని కోరారు. ఆ విగ్రహం ఎత్తు, హావభావాలు ఎలాగుండాలన్న వివరాలను అందజేసి.. అందుకయ్యే ఖర్చుకు ఓకే చెప్పారట. మోహన్ రాజుతో ఒప్పందం కుదుర్చుకున్న వెంకటేశ్వరరావు, రవిచంద్రలు.. విగ్రహ తయారీకి అవసరమయ్యే స్క్రాప్ ను ఆటోమోబైల్ స్క్రాప్ నుంచి సేకరించే పనిని మొదలెట్టారు. తెనాలిలో కొంత స్క్రాప్ ను సేకరించిన వారిద్దరూ.. మిగిలిన దానిని హైదరాబాద్, విశాఖపట్టణం, చెన్నై, గుంటూరులలోని తుక్కు వ్యాపారుల నుంచి సేకరించారట.
14 అడుగుల ఎత్తు.. రెండు టన్నుల బరువు
మోహన్ రాజు చెప్పిన దాని ప్రకారం వెంకటేశ్వరరావు, రవిచంద్రలు ఇప్పటికే మోదీ విగ్రహాన్ని తయారు చేశారు. అలా రూపొందిన విగ్రహాన్ని తమ ఇంటి ఆవరణలో పెట్టగా.. కొందరు దీనిని ఫొటోలు తీసుకుని, వీడియోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ విగ్రహం 14 అడుగుల ఎత్తు ఉండగా.. బరువు మాత్రం ఏకంగా రెండు టన్నులు ఉందట. విగ్రహ తయారీకి వినియోగించిన స్క్రాప్ లో ప్రధానంగా బైకుల చైన్లు, గేర్ వీల్స్, ఇనుప రాడ్లు, నట్లు, బోల్టులు, ఇతరత్రా విరిగిన మెటల్ ముక్కలున్నాయట. ఇక మోదీ హెయిర్ స్టైల్, గడ్డం కనుబొమలను తీర్చిదిద్దేందుకు జీఐ వైర్ ను వాడారట. ఇక వెంకటేశ్వరరావు, రవిచంద్రలతో పాటు మరో పది మంది కలిసి ఏకంగా 600 గంటలు శ్రమపడితే గానీ మోదీ స్క్రాప్ విగ్రహం తయారు కాలేదట. విగ్రహం తయారీ పూర్తి అయిందన్న సమాచారం ఇప్పటికే మోహన్ రాజుకు చేరిపోగా.. ఈ విగ్రహాన్ని బెంగళూరులో ప్రతిష్టించేందుకు ఆయన ముహూర్తాలు చూసుకుంటున్నారట. అంటే.. త్వరలోనే మోదీ స్క్రాప్ రూపంలోని మోదీ విగ్రహం త్వరలోనే బెంగళూరులో ఠీవీగా నిలబడనుందన్న మాట. ఇదిలా ఉంటే.. ఈ విగ్రహాన్ని చూసిన పలువురు శిల్పుల ప్రతిభను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో మోదీ పాలనను తూర్పారబడుతూ స్క్రాప్ ను స్క్రాప్ తోనే తయారు చేశారులెమ్మంటూ సెటైర్లు సంధిస్తున్నారు.