మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత తమిళ ‘వేదాళం’ రీమేక్ మూవీని లైన్ లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. నటినటులను వెతికే పనిలో ఉన్నాడు దర్శకుడు మెహర్ రమేష్. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంక్రాంతి తర్వాత ప్రారంభం కానున్నదని టాక్. 2021 సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలుపెట్టి 2021 దసరాకు రిలీజ్ చేయాలని చిరు భావిస్తున్నారని, ఈమేరకు దర్శకుడిని రెడీ అవమని చెప్పారని తెలుస్తోంది.
‘వేదాళం’ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి పక్కాగా తయారుచేసుకున్నారట మెహర్ రమేష్. ఈ సినిమాలో హీరో చెల్లి పాత్ర చాలా ముఖ్యమైంది. ఈ పాత్రకు ‘మహానటి’ ఫేమ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ను ఫైనల్ చేశాడు దర్శకుడు మెహర్ రమేష్. ఇక ప్రతినాయకుడి పాత్ర కోసం ఒక బాలీవుడ్ నటుడిని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
అయినప్పటికీ .. ‘వేదాళం’ సినిమా కథను తయారుచేసుకున్న విధానం నచ్చి నమ్మకం కుదరడంతో మెహర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. మెహర్ రమేష్ కూడా ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక ‘ఆచార్య’ సినిమా విషయానికి వస్తే ఈ నెల 9వ తేదీ నుండి షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నారు మెగాస్టార్. ‘వేదాళం’ సినిమాతో పాటు చిరు వినాయక్ తో ‘లూసిఫర్’ సినిమా కూడా చేయనున్న విషయం మనకు తెలిసిందే. మరి మెహర్ ఈ అవకాశాన్ని ఏ స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.











