‘శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో…’ అన్న ‘కొండవీటిదొంగ’సురేఖ హృదయాన్ని కొల్లగొట్టిన సంగతి ఎంతమందికి తెలుసు. ఈ వినాయకచవితి రోజున వీరిద్దరూ ఇలా ఫొటోకు పోజు ఇస్తుంటే చూడముచ్చటగా ఉంది కదూ. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఇదే కదా. నలభై ఏళ్ల ‘నాతిచరామి’ బంధమిది. ఓ మెగాస్టార్ తో తన బంధం ‘అల్లు’కుంటుందని ఆమెకు మాత్రం ఏంతెలుసు? పుట్టినరోజు పండుగే అందరికీ… మరి పుట్టింది ఎందుకో తెలిసేది మాత్రం కొందరికే. ఆ కొందరిలో ఈ జంట తమ జీవితాన్ని సార్థకం చేసుకుంది.
ఈ జంట మధ్య తొలివలపు అనుభవాలు తెలుసుకుంటే అవి ఎంత తీయనో అర్థమవుతుంది. పెళ్లిచూపుల కన్నా ముందే వీరిద్దరికీ చూపులు కలిసిన ఓ శుభవేళ రానేవచ్చింది. చిరంజీవి సినిమాలు చేసే తొలిరోజుల్లోనే ఆయన క్లాస్ మేట్ ఒకరు చిరును అల్లు రామలింగయ్య ఇంటికి తీసుకువెళ్లారట. మనహాస్యపు జల్లు అల్లువారు ఆ సమయంలో ఇంట్లో లేరు. సురేఖే కాఫీ పెట్టి ఇచ్చారట. అలా చూపులు మాత్రం కలిశాయిగానీ అప్పటికి అంతవరకే జరిగింది. కలెక్టర్ చేసుకోవాల్సిన సురేఖ కు పెళ్లికొడుకుగా మళ్లీ చిరంజీవే వచ్చారు. అల్లువారి ఇంట్లో ఆయన పెట్టిన తొలి అడుగు పెళ్లి ప్రస్తావన దాకా వెళ్లిపోయింది.
పెళ్లి చూపుల ప్రహసనం ఇలా…
చిరు, సురేఖలను ఒంటరిగా వదిలేసి అందరూ బయటికి వెళ్లిపోయారు.
చిరంజీవి: ఏం చదువుకున్నారు?
సురేఖ: బీఏ (ఆమె నోటి నుంచి ఆ ఒక్క మాటే)
ఇద్దరి మధ్యా మాటలు కలవకపోయినా మనసులు కలిసిన భావన.
‘చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి’ అనుకున్నారు మనసులో చిరు.
‘మా అమ్మ నటుడినే చేసుకుంది కదా… నేనూ నటుడినే చేసుకుంటే పోలా’అనే భావన సురేఖలోనూ. మొత్తానికి పెళ్లి ఫిక్స్. ఫిబ్రవరి 20న పెళ్లి… ఈ మూడు నెలల గ్యాప్ లో ఏం జరిగిందో చూద్దాం…
అంతా ఓకే అనుకున్నా ఇద్దరూ మాట్లాడుకోడానికి అప్పట్లో సెల్ ఫోన్లూ లేవు. ఉన్నది ఒక్క ల్యాండ్ లైనే. ఆమెతో ఒక్కసారి మాట్లాడాలని అబ్బాయికి తహతహ. ఏమైతే అది అయిందిలే అని ఫోన్ చేసి ‘హలో… నేను చిరంజీవి’ అనగానే అవతల కాసేపు మౌనం…
‘నేను సురేఖనండీ… ఫోన్ ఎవరికివ్వమంటారు?’ అవతలి గొంతు.
ఏం మాట్లాడాలో చిరంజీవికీ తెలియడంలేదు… చివరికి ‘మీ అన్నయ్య ఉన్నారా?’ అన్నారు.
‘లేరండీ’ సురేఖ సమాధానం.
‘వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పు’ ఫోన్ పెట్టేశారు చిరంజీవి.
ఓ పక్క‘తాతయ్య ప్రేమ లీలలు’సినిమా షూటింగ్ జరుగుతుంటే… ఇంకో పక్క చిరు పెళ్లిగోల. మొత్తానికి ‘శుభలేఖ’లు అచ్చయ్యాయి… మూడుముళ్లూ పడ్డాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆ జంట కనులపంటగా ఇలా…