తెలంగాణలో టీఆర్ఎస్ అక్రమాలపై సీబీఐ విచారణకు కూడా తాము కేంద్రానికి విన్నవిస్తామని బీజేపీ తెలంగాణ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ సంకల్ప సభకు వెళ్తూ ఆయన పెద్దపల్లిలో, కాగజ్‌నగర్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల సొమ్ము దోచుకునే వారిని బీజేపీ వదిలిపెట్టే ప్రశ్నే లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను దోచుకుంటోందని వ్యాఖ్యానించారు. సింగరేణి విషయంలో కవిత కొన్ని యూనియన్లను అడ్డుపెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. సింగరేణిలో టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై సీబీఐ విచారణకు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడూ కార్మికుల పక్షాన ఉంటుందన్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ, మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నాయన్నారు.
తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయమన్న తరుణ్ చుగ్.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ రోజురోజుకు బలపడుతోందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ది రాక్షస పాలనగా అభివర్ణించారు. కొన్ని చోట్ల పోలీసులు నేరస్తులను కాపాడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక అంశాలను ప్రజలకు వివరిస్తామని వ్యాఖ్యానించారు. బీజేపీపై రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందని, అందుకే ఇతర పార్టీల నేతల తమ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. రాక్షస పాలన నుంచి త్వరలోనే తెలంగాణకు విముక్తి వస్తుందని, బీజేపీ విముక్తి కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ఇదే కార్యక్రమంలో బండి సంజయ్ కూడా టీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన లాయర్ దంపతుల హత్యకేసులో టీఆర్ఎస్ నేత పుట్టా మధుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తెలంగాణలో మూడు రోజుల పర్యటన
బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పాల్వాయి హరీష్ బాబు చేరిక సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న తరుణ్ చుగ్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు. గురువారం నాగార్జునసాగర్‌లో పర్యటించి ఉపఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఆపరేషన్ ఆకర్ష్..
కాగా ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా తెలంగాణలో పలువురు నాయకులను చేర్చకుంటోంది బీజేపీ. సిర్పూర్ కాగజ్‌నగర్ కీలక నేత పాల్వాయి హరీష్ ఇప్పటికే చేరగా మరో కీలక నేత రమేష్ రాథోడ్ కుటుంబం కూడా బీజేపీలో చేరనుంది. నాంపల్లి కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ కూడా బీజేపీలో చేరనున్నారు. వీరు కాకుండా కాంగ్రెస్ సీనియర్ లీడర్లు మహేశ్వర్‌రెడ్డి కూడా కాషాయం జెండా కప్పుకోనున్నారు. ప్రస్తుతానికి వీరి పేర్లే బయటకు వచ్చాయని, రానున్న రెండు రోజుల్లో మరికొందరు నేతలు తమ పార్టీలో చేరుతున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ధిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ నుంచి కూడా రానున్న కాలంలో చేరికలుంటాయని ఆ నాయకులు చెబుతున్నారు. మూడు రోజుల తరుణ్ చుగ్ పర్యటనలోనూ చేరికల అంశంపై చర్చ జరగనుంది.
Must Read ;- మారని టీ కాంగ్రెస్ తీరు.. ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ పదును