టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ రూటే సెపరేటు. మిగతా హీరోల కన్నా డిఫెరెంట్ గా వెళ్ళాలనుకొనే తత్వం. ఆ ప్రయత్నంలో కొన్ని సార్లు పరాజయాల్ని ఫేస్ చేయాల్సి వస్తోంది. ఎర్లియర్ గా అతడు నటించిన ‘పడిపడిలేచె మనసు, రణరంగం, జాను’ సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. అయినప్పటికీ.. తన ఆసక్తికి తగిన కథల్నే ఎంపిక చేసుకుంటూ జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. ఆ క్రమంలో కొన్ని ప్రయోగాలు కూడా చేయాలనుకుంటున్నాడు.
నిజానికి లాక్ డౌన్ లేకపోతే… ఈ పాటికి అతడి ‘శ్రీకారం’ సినిమా థియేటర్స్ లో ఉండేది. ఇందులో ఒక యువరైతుగా డిఫెరెండ్ మేకవర్ తో నటిస్తున్నాడు శర్వానంద్.
ఆ సినిమా చివరి దశలో ఉండగానే.. ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ అనే డిఫెరెంట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కాక మరో రెండు ప్రాజెక్టుల్ని లైన్ లో పెట్టుకున్నాడు. శర్వా ఓకే చేసిన ఆ కొత్త ప్రాజెక్టుల్లో ఒకటి ప్రకాష్ అనే నూతన దర్శకుడితో అని సమాచారం. శర్వా ఇంతకుముందు చేయని ఓ వైవిధ్యమైన కథతో తెరకెక్కనుందట. ఇందులో శర్వానంద్ వికలాంగుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. శర్వా లాంటి హ్యాండ్సమ్ హీరో.. వికలాంగుడిగా నటించడం అంటే సాహసమనే చెప్పాలి. ఇలాంటి పాత్రలు తమిళంలో వర్కవుట్ అవుతాయి కానీ.. తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం.
అయితే శర్వానంద్ పనిగట్టుకొని ఆ సినిమా చేయాలని డిసైడయ్యాడంటే.. అందులో ఖచ్చితంగా ఏదో కొత్తదనం ఉండే ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం శర్వానంద్ నిర్మాతను వెతికే పనిలో ఉన్నాడట. ఇదిలా ఉంటే శర్వానంద్ చాలా కాలం తర్వాత మళ్ళీ కోలీవుడ్ లో ఒక సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఎప్పుడో ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ (తెలుగులో జర్నీ) లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మరో తమిళ సినిమా చేయలేదు. రాజు సుందరం దర్శకత్వంలో త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుందట ఈ సినిమా. మరి ఈ కొత్త ప్రాజెక్టులు శర్వాకు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.











