కరోనా కారణంగా సంక్షోభానికి గురైన సినిమా రంగానికి ఇప్పుడు చికిత్స ప్రారంభమైనట్టు సమాచారం. ఇప్పటికీ మేలుకోకపోతే సినిమా రంగం కోలుకోవడం కష్టమనే అభిప్రాయానికి సినీ ప్రముఖులంతా వచ్చినట్లు భోగట్టా. ఇప్పటికే నిర్మాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సినీ కార్మికులు పస్తులుండే పరిస్థితులు వచ్చాయి. ఎప్పుడూ కళకళలాడే సినిమా రంగం ఇంతలా కళతప్పిన పరిస్థితులు చరిత్రలో లేవు. అందుకే మొత్తం దక్షిణాది సినీ పరిశ్రమ యావత్తూ ఈ సెప్టెంబరు రెండు వారం నుంచి షూటింగులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
తెలుగుతో పాటు, తమిళం, మళయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలు షూటింగులపై కసరత్తులు ప్రారంభించాయి. కేజీఎఫ్ 2 దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆగస్టు 26 నుంచి షూటింగ్ మొదలుపెట్టడంతో అందరిలోనూ కదలిక మొదలైంది. నాగచైతన్య, సాయిపల్లవిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ షూటింగ్ ను సెప్టెంబరు 7 నుంచి మొదలుపెట్టడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాజమౌళి ఆర్.ఆర్. ఆర్. షూటింగ్ ను కూడా రెండు వారాల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి చేపట్టిన మరో భారీ ప్రాజెక్టు ఇది.
ఈ చిత్ర దర్శకులు రాజమౌళి, దానయ్యలు కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్నారు. వైద్యుల సలహాలు తీసుకుని షూటింగ్ ప్రారంభించే పనిలో రాజమౌళి ఉన్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్’ కూడా త్వరలో మళ్లీ షూటింగ్ కు వెళ్లనుంది. ఇప్పటికే థాయిలాండ్ లో కొంత షూటంగ్ చేశారు. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, పార్తిబన్, జయరాం, ఐశ్వర్యారాయ్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరో 20 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
కరోనా పేరుతో ఇప్పటిదాకా కొనసాగిన షూటింగుల విరామానికి ఇకనైనా చరమ గీతం పాడాలని అందరూ కోరుతున్నారు. కాకపోతే పెద్ద హీరోలు షూటింగులకు వస్తారా రారా అనే సందిగ్ధం నెలకొంది. దీని మీద హీరోలెవరూ ఇంకా నోరు విప్పడం లేదు. ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ షూటింగుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో రూ. 6 కోట్ల వ్యయంతో భారీ సెట్ వేశారు. ఇది హాస్పటల్ సెట్. ఇక్కడ సెప్టెంబరు 20 నుంచి షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం.
10 రోజుల పాటు సినిమాలోని ఇతర తారాగణంతో ఇక్కడ షూటింగ్ చేస్తారట. ఆ తర్వాత ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఈ సెట్ లో చిత్రీకరించనున్నారు. అన్ లాక్ 4.0 దశ కూడా రేపటి నుంచి మొదలవుతుంది. ఈ నిబంధనలతో నిమిత్తం లేకుండానే ప్రభుత్వం షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కాకపోతే ప్రభుత్వ నిబంధనలు పెద్ద సినిమాలకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సెప్టెంబరులోనే ప్రభుత్వం ఈ నిబంధనలను కూడా సడలించే అవకాశం కనిపిస్తోంది. అనుకున్నట్లుగా అన్నీ సవ్యంగా జరిగితే త్వరలోనే సినీ పరిశ్రమలో షూటంగుల సందడి మొదలవుతుంది.











