ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో వరుసగా సమావేశమైన చంద్రబాబు..రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాష్ట్రంలో భూకబ్జాల నిరోధానికి కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూకబ్జా నిరోధక చట్టానికి వెంటనే ఆమోదముద్ర వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో భూకబ్జాలు పెద్ద సమస్యగా మారాయన్నారు చంద్రబాబు. రాష్ట్రప్రభుత్వానికి రోజువారీగా అందుతున్న 10 ఫిర్యాదుల్లో ఆరు భూకబ్జాలకు సంబంధించినవేనన్నారు.
కంప్యూటరీకరణలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోవడం వల్ల నాయకులు, అధికారులు కుమ్మక్కై బలవంతంగా ప్రైవేటు భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని చెప్పారు. బాధితులు ఆ భూములను ఎంతో కొంత అమ్మడానికి సిద్ధమైతే వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించి చేజిక్కించుకున్నారని ఆరోపించారు. ఇంటి పట్టాల పేరుతోనూ పెద్ద ఎత్తున భూకబ్జాలు జరిగాయన్నారు. అటవీ, బంజరు భూముల ఆక్రమణలకు లెక్కే లేదన్నారు. అలాంటి అక్రమాలను కఠినంగా అణచివేసేందుకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి, కేంద్ర ఆమోదం కోసం పంపామన్నారు. సాధ్యమైనంత త్వరగా దానికి ఆమోదం తెలపాలని అమిత్ షాను కోరినట్లు చెప్పారు.
ఇక ప్రివెన్షన్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్‌లెగ్గర్స్, డెకాయిట్స్, డ్రగ్ అఫెండర్స్, గూండాస్, ఇమ్మోరల్ ట్రాఫికింగ్‌కు పాల్పడే వారిపై PD యాక్ట్ ప్రయోగించడానికి అనుమతి కోరామన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాకం వల్ల గంజాయి, డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉందన్నారు చంద్రబాబు. ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి దీన్ని నియంత్రిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే గంజాయి, డ్రగ్స్ పూర్తి నియంత్రణ సాధ్యమవుతుందన్నారు చంద్రబాబు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశమయ్యారు చంద్రబాబు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థికసాయం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్- బందరు పోర్టు మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేతోపాటు మరికొన్ని జాతీయ రహదారులపై రహదారి రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు.
NDA భాగస్వామ్య పక్షంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించీ చర్చించామని చెప్పారు చంద్రబాబు. గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం రూ.10 లక్షల అప్పు చేసిందన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అప్పు తీసుకొనే సామర్థ్యం జీరోకు పడిపోయిందని నీతిఆయోగ్ నివేదిక వెల్లడించిందని వివరించారు. ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో గత అసెంబ్లీ ఎన్నికలు, తాజాగా జరిగిన శాసనమండలి ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూటమిని గెలిపించారని..దాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని గాడిలోపెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు చంద్రబాబు. తొలి ఏడాదిలోనే 12.94% వృద్ధిరేటు సాధించామన్నారు. ఈ ఏడాది నుంచి 15% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు.
నితిన్ గడ్కరీకి పలు జాతీయ రహదారుల కోసం విజ్ఞప్తి చేశామన్నారు చంద్రబాబు. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డును వేగంగా పూర్తి చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. అమరావతికి 140 మీటర్ల వెడల్పుతో 189 కి.మీ.అవుటర్ రింగ్‌రోడ్డు గురించి గడ్కరీతో చర్చించారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి వచ్చే భక్తుల రద్దీ కారణంగా అటవీ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నందున ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ లేదా రహదారుల విస్తరణ చేపట్టాలని కోరామన్నారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు. అమరావతి- వినుకొండ, విశాఖపట్నం- మూలపేట రహదారులు వేగంగా పూర్తి చేయాలని కోరామన్నారు.