కూటమి ప్రభుత్వం మద్దతుతోనే తన విజయం సాధ్యమైందన్నారు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు శ్రీనివాసులు నాయుడు. ఐతే శ్రీనివాసులు నాయుడు గెలుపు తర్వాత కూటమికి షాక్ అంటూ కొన్ని వార్త కథనాలు వెలువడ్డాయి. ఐతే దీనిపై శ్రీనివాసులు నాయుడు తాజాగా క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సహకారంతోనే మరోసారి కౌన్సిల్‌లో అడుగుపెట్టినట్లు చెప్పారు.
ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు గాదె శ్రీనివాసులు నాయుడు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడును చంద్రబాబు అభినందించారు. టీచర్స్ సమస్యలను పరిష్కరించడంతో పాటు, వారిని అన్ని వేళలా గౌరవిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేశ్ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామని గాదె శ్రీనివాసులు నాయుడుతో చెప్పుకొచ్చారు చంద్రబాబు.
ఇక ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా..మూడు స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు, కూటమి మద్దతిచ్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో గాదె శ్రీనివాసులు నాయుడుతో పాటు పాకలపాటి రఘువర్మకు మద్దతిచ్చింది. ఇద్దరు అభ్యర్థులకు ఒకరికి మొదటి ప్రాధాన్యత, మరొకరికి రెండో ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని సూచించింది. దీంతో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించగా..రఘువర్మ రెండో స్థానంలో నిలిచారు. ఇక గుంటూరు – కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర విజయ దుందుభి మోగించగా…ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ గెలుపొందారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి ఓటు శాతం గత అసెంబ్లీ ఎన్నికల కంటే మించిపోవడం ఆశ్చర్యకర అంశం.