టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ హస్తినలో వాలిపోయారు.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.. రెండు రోజులపాటు ఆయన హస్తినలోనే మకాం వేసి, అనేక కార్యక్రమాలు చక్కబెట్టనున్నారు.. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీగా నిధులు కేటాయించింది మోదీ సర్కార్.. గత కొంతకాలంగా ఎన్నడూ లేని విధంగా రైల్వే శాఖ ఏకంగా 9,417 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో, రైల్వే మంత్రితోపాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన మంతనాలు జరపనున్నారు..
ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు రాజకీయంగానూ బిజీగా ఉన్నారు లోకేష్.. ఢిల్లీలో ఆయనను ప్రముఖ రాజకీయ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు.. అమరావతి నుండి హస్తిన చేరుకున్న లోకేష్.. కేంద్ర మంత్రులతో భేటీకి ముందే ప్రశాంత్ కిశోర్ సమావేశం అయ్యారు.. సుమారు అరగంట పాటు ఈ ఇద్దరి భేటీ జరిగింది.. ఇద్దరి మధ్య ఏపీ రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలలోని మార్పులపైనా చర్చ జరిగినట్లు సమావేశం..
ఇటీవల జరిగిన ఎన్నికలకు కొద్దిగా ముందు జగన్‌కు దూరం అయ్యారు ప్రశాంత్ కిశోర్.. వైసీపీ అధినేత రాజకీయ వ్యూహాలు, ఆయన ప్రభుత్వ విధానాలు నచ్చక ఆపార్టీ వ్యూహకర్త స్థానం నుండి వైదొలగారు.. జగన్ నిర్ణయాలను తూర్పారపట్టారు.. వైసీపీ ఓటమి ఖాయమని ఎన్నికలకు కొన్ని నెలల ముందే తేల్చిపారేశారు ప్రశాంత్ కిశోర్.. జగన్ విధానాలను ఎండగట్టిన ప్రశాంత్ కిశోర్.. చివరి మూడు వారాలు టీడీపీకి సలహాలు, సూచనలు అందించారని ప్రచారం జరిగింది..
ఈ ఎన్నికలలో కూటమికి ట్రంప్ కార్డ్‌గా, జగన్ ఓటమిని శాసించిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ఈ చట్టంపై ప్రజల్లో ఉన్న భయం, ఆందోళనలను సర్వే చేసి కూటమి నేతలకు సూచనలు చేశాడు.. జగన్ ప్రభుత్వ వ్యతిరేకతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోడవడంతో కూటమి ఢమాకా పేల్చింది.. తాజాగా పీకే భేటీలోనూ జగన్ తప్పులు, ఆయన బలహీనతలను సైతం స్పష్టంగా లోకేష్‌కి అందజేశాడట ప్రశాంత్ కిశోర్. మరోవైపు, ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వీటి ఫలితాలు, వాటి పరిణామాలు సైతం ఈ ఇద్దరి భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం..
ఈ ఇద్దరి భేటీపై వైసీపీ అలెర్ట్ అయింది.. అందులోనూ కేంద్ర మంత్రులతో లోకేష్ సమావేశానికి ముందు ఈ సమావేశం జరగడంతో తాడేపల్లిలో అలజడి మొదలయింది.. జగన్ సీక్రెట్లను లోకేష్‌కి అందించి ఉంటారని భావిస్తున్నారు వైసీపీ నేతలు.. మరి, ఈ భేటీ పరిణామం ఎలా ఉంటుందో త్వరలోనే తేలనుంది..