ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీల్లో మరోకటి రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకి ముందు తాము అధికారంలోకి రాగానే వెంటనే మద్యం విధానాన్ని రద్దు చేస్తామని.. అలాగే నిర్మాణాల కోసం ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. చెప్పినట్టుగానే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డీఎస్సీ నియామకాలపై పెట్టగా.. మద్యం విధానం రద్దు, ఇసుక విధానం రద్దు చేసి.. ఉచిత ఇసుకను అందిస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం ప్రభుత్వం జారీ చేసింది. అయితే మొదట ప్రకటించిన ఇసుక విధానంలో సీనరేజ్‌పై నామమాత్రపు పన్నులను విధించింది. అయితే ఇసుకను పూర్తిగా ఉచితంగా అందిస్తే లాభ, నష్టాలు ఎలా ఉంటాయని భావించిన సర్కార్ .. చివరికి వినియోగదారునికి ఇసుకను పూర్తిగా ఉచితంగా అందివ్వాలని నిర్ణయించింది.
ఇప్పటికే ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఇకపై వాటికి సంబంధించి నామమాత్రపు రుసుములనూ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై రాష్ట్రంలో పూర్తి ఉచితంగా ఇసుకను సరఫరా చేసేందుకు మార్గం సుగమం అయింది. ఇసుకపై సీనరేజ్ రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించడంతో వినియోగదారులకు మరింత ఊరట లభించింది. ఇప్పటివరకు సీనరేజ్, తదితరాల రూపంలో స్థానిక సంస్థలకు జమయ్యేలా మెట్రిక్ టన్నుకు రూ.88 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై వినియోగదారులు దీన్ని కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సీనరేజ్ రద్దు నిర్ణయం అమలుకు సంబంధించి గనులశాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు.. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలపనున్నారు. దీంతో ఇకపై ఇసుకను వినియోగదారులు ఉచితంగా పొందే అవకాశం ఏర్పడింది
గత వైసీపీ హయాంలో మెట్రిక్ టన్నుకు రూ.475 చొప్పున లెక్కాపత్రం లేకుండా ఇసుకను విక్రయించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనికి స్వస్తి పలికింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే.. జులై 8న ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చారు. అయితే ఎన్‌జీటీ మార్గదర్శకాల ప్రకారం రుతుపవనాల సీజన్ ముగిసే వరకు (అక్టోబరు 15 వరకు) నదుల్లో ఇసుక తవ్వకూడదు కాబట్టి .. గతంలో నదుల్లో తవ్వి, నిల్వ కేంద్రాల్లో ఉంచిన ఇసుకను ఉచిత విధానంలో భాగంగా సరఫరా చేశారు. గతంలో నదుల్లో తవ్వి నిల్వ కేంద్రానికి ఇసుకను రవాణాచేసి తెచ్చినందుకు అయిన రవాణా ఖర్చు, సీనరేజ్ ఫీజు, నిర్వహణ ఖర్చు వంటివి ఇప్పటివరకు వసూలు చేశారు.
రుతుపవనాల సీజన్ ముగియడంతో ఈనెల 16 నుంచి నదుల్లో కూలీలతో ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. ఇందులో సీనరేజ్ ఫీజు మెట్రిక్ టన్నుకు రూ.88, నదిలో ఇసుక తవ్వి, ట్రాక్టరులో ఒడ్డుకు తెచ్చి, అక్కడ లారీలో లోడ్ చేసిన ఖర్చు కింద ఆయా రీచ్‌ను బట్టి గరిష్ఠంగా రూ.90 నుంచి రూ. 100 వరకు వసూలు చేస్తున్నారు. సీఎం ప్రకటనతో ఇకపై సీనరేజ్ ఫీజును సైతం వసూలు చేయరు. మరో విశేషం ఏమిటంటే.. నది సమీప గ్రామాలు, పట్టణాలకు చెందినవాళ్లు తమ నిర్మాణ అవసరాలకు ఇసుక తవ్వి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఉచితంగా తీసుకెళ్లడానికి అవకాశం కల్పించారు.
నదికి దూరంగా ఉండేవారు సైతం ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లొచ్చు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సర్కారు రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి 2019 సెప్టెంబరు నుంచి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలను అప్పగించింది. 2021 మే వరకు టన్ను రూ.375 ధరతో 3.7 లక్షల టన్నుల ఇసుకను విక్రయించింది.