ఏపీలో కొత్తగా పాలనా బాధ్యతలు చేపట్టిన కూటమి సర్కారులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… విద్యా శాఖతో పాటు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. కూటమి సర్కారు అదికారంలోకి వచ్చినంతనే తనదైన చాతుర్యాన్ని ప్రదర్శించిన లోకేశ్… ఐటీ సంస్థల్లో అగ్రగామిగా కొనసాగుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను విశాఖ వచ్చేందుకు ఒప్పించారు. ఇటీవలే టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో భేటీ అయి… రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందించనున్న ప్రోత్సాహాన్ని వివరించారు. లోకేశ్ ప్రతిపాదనలు విన్నంతనే విశాఖలో టీసీఎస్ హబ్ ను ఏర్పాటు చేసేందుకు చంద్రశేఖరన్ ఒప్పేసుకున్నారు. ఈ హబ్ ద్వారా ఏపీలోని 10 వేల మందికి ఉపాధి లభించనుంది. తదనంతరం టీసీఎస్ హబ్ ను విస్తరించే అవకాశాలను పరిశీలించనున్నట్లు చంద్రశేఖరన్ ప్రకటించారు.
వచ్చీరాగానే తనదైన శైలి స్పీడుతో ఫలితాన్ని రాబట్టిన లోకేశ్… తాజాగా రాష్ట్రానికి సంబంధించిన ఐటీ పాలసీని రూపొందించారు. ఇటీవలే రూపకల్పన పూర్తి అయిన ఈ పాలసీకి లోకేశ్ తుది మెరుగుతులు దిద్దుతున్నట్లుగా సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రానున్న ఐదేళ్ల పాలు రాష్ట్రంలో అమలు కానున్న ఈ పాలసీ ద్వారా ఏకంగా రూ.20 వేల కోట్ల పెట్టుబడులను రాబట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం. అదే సమయంలో రానున్న ఐదేళ్లలో ఒక్క ఐటీ రంగంలోనే 2 లక్షల మేర ఉద్యోగాలను రాష్ట్ర యువతకు అందించాలన్నది ఈ పాలసీ ప్రదాన ఉద్దేశ్యం. ఇందుకోసం ఏ రీతిన అడుగులు వేస్తే… పాలసీ సఫలం అవుతుందన్న దిశగానూ ఆ శాఖ అధికారులతో లోకేశ్ సుదీర్ఘ మంతనాల్లో మునిగిపోయారు.లోకేశ్ తుది మెరుగులు దిద్డడం పూర్తి కాగానే… ఈ పాలసీకి రాష్ట్రప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది.
ఈ .పాలసీలో ప్రధానంగా రెండు అంశాలు కీలక భూమిక పోషించనున్నాయి. ఆయా సంస్థలు పెట్టే పెడ్టుబడుల స్థాయిని బట్టి ఆ సంస్థలకు ఆయా ప్రాంతాల్లో భూముల కేటాయింపు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనలు ఉంటాయి. అదే సమయంలో ఆయా సంస్థలు ఎంత మొత్తం మేర ఉద్యోగాలు ఇవ్వనున్నాయన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని ఆ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. ఓ వైపు మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే.. మరోవైపు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఐటీ పెట్టుబడులు పోటెత్తడం ఖాయమనే చెప్పక తప్పదు. ఈ పాలసీ రూపకల్పనలో లోకేశ్ ఆషామాషీగా వ్యవహరించలేదని చెప్పాలి. దేశంలో ఐటీ రంగంలో ముందువరుసలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయించిన లోకేశ్… వాటి కంటే కూడా మెరుగైన పాలసీ రూపొందేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
2014-19 మధ్యలోనూ టీడీపీ అధికారంలో ఉండగా… నాడు కూడా ఐటీ శాఖ మంత్రిగా లోకేశే వ్యవహరించారు. నాడు చంద్రబాబు సర్కారు తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో కార్యకలాపాలు సాగించేందుకు 250 దాకా కంపెనీలు ముందుకు వచ్చాయి. వాటిలో ఓ 100 దాకా కంపెనీలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించగా…మిగిలిన కంపెనీలు అతి త్వరలోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. 2018-24 మధ్య కాలంలో వైసీపీ సర్కారు ఐటీ రంగాన్నే కాకుండా మొత్తంగా పరిశ్రమలు, అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఈ కంపెనీలు ప్రారంభం కావడానిుి మరింత సమయం పడుతోందన్న ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే లోకేశ్ లాంటి సత్తా కలిగిన నేత ఆధ్వర్యంలో రానున్న ఐదేళ్లలో ఐటీ శాఖ పరుగులు పెట్టడం ఖాయమేనని వారు చెబుతున్నారు.