ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తమ ప్రభుత్వం ఓ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ప్రకటించిన ఆయన… దానికి ఇటీవలే మరణించిన టాటా సన్స్ గౌనవ చైర్మన్ రతన్ టాటా పేరును పెడుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి మొత్తం ఈ హబ్ కేంద్రంగానే కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు…
పరిశ్రమల శాఖపై సోమవారం సచివాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు సంబంధించిన అంశాన్ని చంద్రబాబు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు.
త్వరలోనే అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు సాగించనున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. రాష్ట్రంలో పిరిశ్రమల ఏర్పాటు, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమౌన ప్రోత్సాహం, నైపుణ్క అభివృద్ధి.. మొత్తంగా రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతిని పర్యవేక్షిస్తుందని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా అమరావతి కేంద్రంగా పనిచేసే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు అనుబంధంగా రాష్ట్రంలో ఓ ప్రాంతాల్లో జోనల్ కార్యాలయాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ 5 జోనల్ కార్యాలయాల్లో ఒక్కో దానికి ఒక్కో బడా కార్పొరేట్ సంస్థ మెంటార్ గా వ్యవహరిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్పొరేట్ సంస్థలు ఆయా జోనల్ కార్యాలయాల పరిధిలో నైపుణ్య శిక్షణ, నూతన ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతికతను అందజేస్తాయని వివరించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అన్ని రంగాలతో .పాటుగా పారిశ్రామికంగానూ వెనుకబడే ఉందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ఓ మోస్తరు పరిశ్రమలు ఉన్నా… అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉన్న వైనం రాష్ట్ర పురోభివృద్ధికి అవరోధంగా ఉన్నాయని చెప్పాలి. ఈ అడ్డంకులను దాటుకుని ముందుకు సాగితే తప్పించి… రాష్ట్రం పారిశ్రామికవగా పురోగమించదు. ఇందుకోసం పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా ఏ ప్రాంతంలో ఏ తరహా అవకాశాలు ఉన్నాయన్న విషయాలపై సమగ్ర అవగాహనతో చర్యలు చేపట్టాల్సి ఉంది. తాజాగా చంద్రబాబు ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తరహా వ్యవస్థలు ఈ పనులన్నింటినీ చక్కబెడతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.