ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేవీపీ రామచంద్రరావుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజశేఖర్ రెడ్డి హాయాంలో ఆయనకు ఆత్మగా కేవీపీ వ్యవహరించేవారనే పేరుంది. వైఎస్ కు అత్యంత సన్నిహితుల్లో కేవీపీ రామచంద్రరావు ఒకరు. వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పాలనపై ఫోకస్ చేస్తే.. కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ వ్యవహారాలను చూసుకొనేవారని అంటారు. ఎంతలా అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేయాలన్నా కేవీపీ రామచంద్రరావే సొంతంగా నిర్ణయాలు తీసుకొనేవారు. వైఎస్ కుటుంబంతోనూ కేవీపీకి ఎంతో అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే కేవీపీ రామచంద్రరావును వైఎస్ కుమారుడైన జగన్ మోహన్ రెడ్డి అప్పట్లో మేనమామగా భావించేవారని అంటారు.
కేవీపీ రామచంద్రరావు వైఎస్ హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా కీలక పదవులలో కొనసాగారు. ఆయన చనిపోయాక రాష్ట్ర విభజన జరగడం.. ఏపీలో కాంగ్రెస్ కనుమరుగు కావడంతో ఆయన రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యారు. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకే పరిమితం అయ్యారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం జగన్ పాలనపైన కాస్త పాజిటివ్ గా మాట్లాడి ఊరుకున్నారు. కానీ, ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయ్యాక మాత్రం కేవీపీ రామచంద్రరావు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అండగా నిలిచిన కేవీపీ.. ఇప్పుడు ఆమె కుమార్తె షర్మిలకు అండగా నిలుస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
ఎందుకంటే.. ఇప్పుడు వైఎస్ షర్మిల.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఉండి.. తన అన్న వైఎస్ జగన్ పాలనను ఎండగడుతున్నారు. ఇదే క్రమంలో కేవీపీ రామచంద్రరావు కూడా షర్మిలకే మద్దతు పలుకుతూ జగన్ విధానాలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రధాని మోదీ దర్శనం దొరికినందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలపాలని కేవీపీ రామచంద్రరావు తాజాగా ఎద్దేవా చేశారు. అందరు సీఎంల కంటే ఎక్కువ సార్లు జగనే మోదీని కలిశారని అన్నారు. ఇసుక, మద్యం కుంభకోణంలో దేశంలో ఎంతో మంది నేతలు అరెస్టు అవుతుంటే.. బీజేపీ అండతోనే జగన్ ను వారు ముట్టుకోవడం లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు ఉంటే ఏపీలో మాత్రం అంతా నగదుతోనే విక్రయాలు చేస్తున్నారని.. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని కేవీపీ నిలదీశారు.
అంతటితో ఆగకకుండా.. కేవీపీ మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తున్న వైసీపీ నేతలకు సిగ్గు లేదని అన్నారు. పోలవరంపైనా జగన్ సర్కారుపై విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంటోదని కేంద్రంలోని పెద్దలే తనతో అన్నారని ఆరోపించారు. అయితే, కేవీపీ ఈ స్థాయిలో జగన్ పైన ఆరోపణలు చేస్తుండడం వెనుక కాంగ్రెస్ పెద్దలు లేకపోలేదనే వాదన వినిపిస్తోంది. సోనియా గాంధీ సూచనల ప్రకారమే కేవీపీ ఇలా షర్మిల పక్షాన నిలబడ్డారని కూడా అంటున్నారు. పైగా మొదటి నుంచి తన తండ్రి ప్రాణ స్నేహితుడైన కేవీపీకి జగన్ ప్రాధాన్యం ఇవ్వలేదు. అయినా ఆయన జగన్ తీరుపై ఏమీ మాట్లాడలేదు. తాజాగా మాత్రం నోరు విప్పారు. ఏది ఏమైనప్పటికీ తండ్రి వైఎస్ కి ప్రాణస్నేహితుడైన వ్యక్తి.. ఆయన కుమారుడు జగన్ పట్ల ఇలా వ్యవహరించడం.. చర్చనీయాంశం అయింది.