ముఖాన తిట్టేయటం. ఎదుట ఉన్నోళ్లు ఎవరన్నది పట్టించుకోకుండా మాట్లాడే దమ్ము.. ధైర్యం ఉన్న అతి కొద్దిమంది ముఖ్యమంత్రుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్ ఒకరని చెప్పాలి. ప్రధాని మోడీని మాట అనేందుకు సవాలచ్చ ఆలోచించే ఈ రోజుల్లో.. ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేసే ధైర్యం ఆయన సొంతం. తనకు నచ్చని వారిని.. తన ఎజెండాకు భిన్నంగా వ్యవహరించే వారి విషయంలో ఆయన ఎంత కరకుగా ఉంటారన్న విషయం ఆర్టీసీ కార్మికుల సమ్మె వేళలో చెప్పేశారు. తనని తిట్టిపోసిన వారి చేత సైతం పాలాభిషేకాలు చేయించుకునే సత్తా ఆయనకు సొంతం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. విధానాల పరంగా ఆయన తీరును ఏ మాత్రం ఇష్టపడని వారు సైతం.. కేసీఆర్ చేసే కొన్ని పనుల్ని విపరీతంగా మెచ్చుకోవటం కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఆయన్ను కలిసిన వారిని.. ఆయన నిర్వహించే భేటీల్లో పాల్గొన్న వారైతే..ఆయన్ను తెగ మెచ్చేసుకోవటం కనిపిస్తుంది. కేసీఆర్ లో మరో ఆసక్తికరమైన అంశం.. కొన్ని సందర్భాల్లో ఆయన భావోద్వేగానికి లోనవుతారు.
కొన్నేళ్ల క్రితం సవతి తల్లి చేతుల్లో నరకం చూస్తున్న ప్రత్యూష అనే అమ్మాయి గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆమె దీన స్థితిని చూసి చలించిపోయిన ఆయన.. ఇంటికి పిలిపించుకోవటమే కాదు.. ఆమెతో కలిసి కుటుంబం మొత్తం భోజనం చేయటం.. ఆమె భవిష్యత్తుకు పూచీకత్త తాను అని ప్రకటించారు. దత్త పుత్రిక అని తేల్చేశారు. కేసీఆర్ నోటి నుంచి ఒక మాట రాదు. ఒకవేళ వస్తే ఆయన ఎంత కమిట్ మెంట్ తో వ్యవహరిస్తారన్న విషయానికి ప్రత్యూష వ్యవహారం నిదర్శనంగా చెబుతారు. ప్రత్యూష గురించి ఎప్పటికప్పుడు వాకబు చేయటమే కాదు.. తాజా ఆమె ఎంగేజ్ మెంట్ ను నిర్వహించారు. పెళ్లి సంబంధం వచ్చిన తర్వాత.. ఆ విషయంలో కేసీఆర్ చూపించిన పర్సనల్ కేర్ మీడియాలో ఎక్కడా రాలేదు. అబ్బాయికి సంబంధించిన వివరాల్ని సేకరించటమే కాదు.. కుటుంబం ఎలాంటిదన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆయన ప్రదర్శించిన ఆత్రుతను చూసిన ఆయన సన్నిహితులు ఆశ్చర్యానికి గురయ్యారట. మాట అంటే మాట. దత్త కుమార్తె పెళ్లి విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.
ఇదంతా బాగానే ఉంది. మరి.. ఆయన కానీ.. ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎంగేజ్ మెంట్ కు ఎందుకు వెళ్లలేదు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల సీఎం కేసీఆర్ సతీమణి శోభ ఆరోగ్యం బాగా లేకపోవటం.. ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందటమే కారణమని చెబుతున్నారు. శని.. ఆదివారాల్లోనే ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావటంతోనే వెళ్లలేదని చెబుతున్నారు. ఆరోగ్యం సరిగా లేని కారణంగా వెళ్లలేదంటున్నారు. దీంతో పాటు.. ఎంగేజ్ మెంట్ కు వెళ్లటం జరిగితే.. మీడియాలో ఎక్కువ ఫోకస్ కావటంతో కొత్త జంటకు ఇబ్బందులు వస్తాయనే ఊరుకున్నట్లు చెబుతున్నారు. కోవిడ్ వేళలో.. అనవసరమైన హడావుడితో ఆరోగ్య సమస్యలు ఎదురుకావొచ్చన్న కారణం కూడా ఉందని చెబుతున్నారు.