సినిమాల ద్వరా దక్షిణాది చలచిత్ర రంగంతో దేశవ్యాప్తంగా కుష్బూ మంచి పేరు సంపాదించుకున్నారు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న కుష్బూ ఆ తరువాత దేశ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నారు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను విమర్శలు చేయడంలోకుష్బూ ప్రత్యేకత చాటుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ, పార్టీ చేపట్టే కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈక్రమంలో కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని ఆమె సమర్ధించారు. దాంతో పార్టీ నాయకత్వం కుష్బూపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో బిజెపి పార్టీలో కుష్బూ చేరబోతున్నట్లు వార్తలు బలంగా వినిపించాయి. అయితే ఈ వార్తలపై కుష్బూ స్పందించడమే కాకుండా వాటిని ఖండించనూ కూడా లేదు. దీంతో ఆ వాదనలకు బలం చేకూరినట్లయింది.
తాజాగా కుష్బూ కాంగ్రెస్ పార్టీకీ తన రాజీనామాతో షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో కుష్బూ సోమవారం మధ్యాహ్నం బిజెపిలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. కుష్బూ లాంటి బలమైన మహిళా నాయకురాలు బిజెపిలో చేరడం బిజెపి పార్టీకి బలమనే చెప్పాలి. తమిళనాడులో కుష్బూకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈతరుణంలో బిజెపికి సినీ గ్లామర్ తోడవడం ప్లస్సే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రాజకీయ ఎత్తుగడే..
వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి అక్కడ తన బలాన్ని ఈ ఎన్నికల్లో నిరూపించుకోవాలని భావిస్తోంది. గతంలో కంటే ఈసారి మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని బిజెపి వ్యూహ రచన చేస్తోంది. దీనికోసం ప్రజాభిమానం ఉన్న ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. బిజెపి పార్టీలోకి చేరాలని కుష్బూను ఎప్పటి నుంచో ఆ పార్టీనేతలు ఆహ్వానిస్తున్నారు. చేరికపై కొంతకాలంగా మౌనంగా ఉన్న కుష్బూ ఈమేరకు తాజా నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రేపు బిజెపి తీర్ధం తీసుకోబోతుంది. కుష్బూ చేరిక బిజెపికి కొంత అదనపు బలాన్ని ఇచ్చినట్లే అనుకోవచ్చు.











