టిఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటన ముషీరాబాద్‌లో చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన చేస్తున్న సమయంలో అటువైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాస్త తోపులాట జరిగింది.
శుక్రవారం నగరంలో కురిసిన వర్షానికి సెల్లార్‌లో చేరిన వరద నీటితో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన తెలిసిందే. ఆ చనిపోయిన వ్యక్తి హైకోర్టు ఉద్యోగి రాజ్‌కుమార్‌గా గుర్తించారు. బయటికి వెళ్లొస్తానని చెప్పి కిందకు దిగిన వ్యక్తి చనిపోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో రాజ్‌కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ నేతలు ముషీరాబాద్‌లోని రాజ్‌కుమార్ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్న సమయంలో వేరొక కార్యక్రమానికి అటుగా వెళ్తున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈక్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. దీంతో గొడవ సద్దుమనిగింది.