అక్టోబర్ 13, 14వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈసమావేశాల్లో భాగంగా శాసన సభ, శాసన మండలిలకు హాజరయ్యే సభ్యులు, సిబ్బంది, పోలీసులు, మీడియా సిబ్బంది విషయంలో శాసన సభ, మండలి అధ్యక్షులిద్దరు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో తాజా పరిణామాలపై, సభా సమావేశాలపై ముందస్తు చర్యలు తీసుకున్నారు. శాసన సభ, శాసన మండలి సమావేశాలకు హాజరయ్యే వారికోసం సభా ప్రాంగణాలలో కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ నెలలో జరిగిని శాసనసభ వర్షాకాల సమావేశాలు కోవిడ్ నేపథ్యంలో సభా సమావేశాలను అర్ధంతరంగా ముగించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28 వరకు జరగాల్సిన సమావేశాలను 16 వతేదీ వరకే జరిపి ముగించారు.
జిహెచ్ఎంసి తదితర చట్టాల సవరణలో భాగంగా రెండు రోజుల వరకు సమావేశాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 13, 14వ తేదీల్లో శాసన సభ సమావేశాలు జరగనున్నాయి. ఈక్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా సభకు హాజరయ్యే సభ్యులకు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు సభా ప్రాంగణంలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి శాసనసభా కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం(ఈనెల 12) నుండి సభాప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి కోవిడ్ పరీక్షా కేంద్రాలు ప్రారం కాబోతున్నట్లు శాసనసభ కార్యదర్శి పేర్కొన్నారు. సభకు హాజరయ్యే వారు కరోనా పరీక్షలు చేయుంచుకోనున్నారు. శాసన సభ, మండలి సభ్యులతోపాటు సభ్యుల వ్యక్తిగత సిబ్బంది, పోలీసు సిబ్బంది, అసెంబ్లీ సిబ్బంది, అధికారులు, మీడియా సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకోవాలని కార్యదర్శి సూచించారు. సమావేశాలకు హాజరయ్యేవారు మాస్కులు ధరించాలని, కరోనా పరీక్షలు తప్పనిసరగా చేయించుకోవాలని అసెంబ్లీ కార్యదర్శి సూచించారు.











