తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేందుకు కొత్త ఇంచార్జ్‌ని కాంగ్రెస్ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. కొత్త ఇంచార్జ్‌గా నియమితులైన మాణిక్కం ఠాగూర్ ఈ మధ్యే రాష్ట్రంలో పర్యటించి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశాలు నిర్వహించి పార్టీ పరిస్థితులపై చర్చించి రానున్న 2023 ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా గత సోమవారం రోజు జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలతో మాణిక్కం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పార్టీ కార్యాచరణపై మాట్లాడారు. అయితే ఈ సమావేశం నేతలతో వాడివేడిగా జరిగినట్లు తెలిసింది. కొంతమంది నేతల వైఖరీపట్ల మాణిక్కం గుర్రుగా కూడా ఉన్నట్లు తెలిసింది.
అయితే ఆ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని ఏఐసిసి ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ మందలించారనే ప్రచారం జరిగింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ వార్త గ్రూపుల్లో బాగా హల్‌చల్ చేసింది. ఆ సమావేశంలో జగ్గారెడ్డి వైఖరీ పట్ల మాణిక్కం మందలించారని, ఏకంగా వార్నింగ్ కూడా ఇచ్చారని ప్రచారం జరిగింది. ఈ విషయం జగ్గారెడ్డి వరకు చేరడంతో దీనిపై ఆయన స్పందించారు. ఏకంగా ఓ ప్రకటన కూడా ఆయన విడుదల చేశారు. సీఎల్పీలో ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌తో జరిగిన ముఖాముఖి సమావేశంలో తనకు ఎవ్వరూ వార్నింగ్ ఇవ్వలేదన్నారు. తనకు ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు రావడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో తనపై తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. సోమవారం కొత్త ఇంచార్జ్‌తో సీఎల్పీలో జరిగిన సమావేశం చాలా సంతృప్తికరంగా సాగిందని పేర్కొన్నారు. మాణిక్కం ఠాగూర్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందనే నమ్మకాన్ని జగ్గారెడ్డి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పిసిసి పదవి తనకు ఇవ్వాలని గతంలో ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.










