నెలాఖరు ఇట్టే వచ్చేస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఖర్చులా తడిసి మోపెడవుతున్నాయి. ఈ గండం ఎలా గడవడం. ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడడం. ఈసారి ఎవరి దగ్గర చేయి చాచడం. ఇదీ మధ్య తరగతి ఉద్యోగి ఆవేదన అనుకుంటున్నారా? ఇది ప్రతీ నెలా జీతం తీసుకునే సగటు ఉద్యోగి వేదన అనుకుంటున్నారా? వాళ్ల ఆవేదన కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి అలా అనుకోవడం తప్పు కాదు. కాని ఇదంతా ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక శాఖ అధికారుల ఆవేదన.
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దశాబ్దాల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగాలనే లక్ష్యంతో ఎడాపెడా వరాలు కురిపించేస్తున్నారు. ఇది ఆర్ధిక శాఖ అధికారులకు తల ప్రాణం తోకకు వచ్చినట్లుగా తయారవుతోంది. ఎక్కడిక్కడ ఉచిత హామీలను ఉచితానుచితాలు ఆలోచించకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోకుండా వరాలు గుప్పించేస్తున్నారు.
దీంతో ఆర్థిక శాఖ అధికారులకు ఈ అవసరాలు తీర్చేందుకు వనరులు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియడం లేదంటున్నారు. మరో 48 గంటలు గడిస్తే అక్టోబర్ నెల వచ్చేస్తుంది. ఇక జీతాలు, పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇది కాకుండా కొత్తగా వచ్చిన గ్రామ, వార్డు కార్యదర్శుల వేతనాలు, అంగన్ వాడీల వేతనాలు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు ఇలా తలకు మించి భారం కళ్ల ముందు కనపడి ఆర్ధిక శాఖ అధికారులు గుడ్లు తేలేస్తున్నారు.
ఈ హామీలేమిటి మహాశయా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న హామీలు ఆర్థిక శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ అక్టోబర్ నెల ఖర్చుల నుంచి బయటపడాలంటే కనీసం 15 నుంచి 18 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. వీటి కోసం ఇప్పటికే కేంద్రానికి నివేదికలు పంపారు ఆర్ధిక శాఖ అధికారులు. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండడం సాధారణంగా రావాల్పిన ఆదాయానికి కూడా గండి పడింది.
రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. మద్యం దుకాణాలు ఈ మధ్యనే తెరుకుచున్నాయి. బార్లు ప్రారంభించి కూడా వారం, పది రోజులైంది. రవాణా రంగం నుంచి కూడా ఎలాంటి ఆదాయం లేకుండా పోయింది. ఈ పరిస్థితులలో రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది కేంద్రమే అని ఢిల్లీ పెద్దలకు మొరపెట్టుకున్నారు ఆర్థిక శాఖ అధికారులు. అయితే, వారి నుంచి కూడా ఆశించిన స్థాయిలో నిధులు వచ్చే అవకాశాలు లేంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి గట్టేక్కాలంటే ఆర్ బీ ఐ ఒక్కటే ఏకైక దిక్కుగా కనపడుతోంది. అయితే వారి నుంచి కూడా ఆర్ధిక శాఖ అధికారులకు ఎలాంటి హామీ వచ్చినట్లు లేదంటున్నారు కిందిస్థాయి అధికారులు.
గతంలో ఇలా లేదు…
గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడి ఏలికలో ఆర్థిక పరిస్థితి దయనీయంగానే ఉందంటున్నారు. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎక్కడ ఖర్చు చేయాలో, ఎక్కడ ఆపాలో చూసి చేసే వారని, దాంతో చిన్న చిన్న ఇబ్బందులే తప్ప ఆర్థికంగా దివాలా తీసింది లేదంటున్నారు. సమైక్య రాష్ట్రంలో కూడా వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అక్కడి నుంచి నిధులు ఎన్ని కావాలంటే అన్ని తెప్పించుకుని ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసే వారని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉచితాలే ఉచితానుచితాలు చూడకుండా హామీలు ఇవ్వడంతో ఆర్థికంగా రాష్ట్రం అథోగతిలోకి వెళ్లిందంటూ తలలు పట్టుకుంటున్నారు.










