డార్లింగ్ ప్రభాస్.. సెలక్టివ్ మూవీలతో అడుగులు వేస్తున్నారు. బాహుబలితో ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు మళ్లీ అదే స్థాయి చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శక రచయిత ఓంరౌత్ తో కలిసి సంచలనాత్మకమైన సరికొత్త ప్రాజెక్టును ప్రభాస్ ప్రకటించబోతున్నారు. మంగళవారం ఉదయం 7.11 గంటలకు ఆ ప్రకటన రానుంది. . ఇందులో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారట.
దీనికి సంబంధించి సోమవారం వచ్చిన ఒక ట్వీట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లో ప్రభాస్, ఓం రౌత్ ఇద్దరూ వీడియో కాల్ మాట్లాడుకున్న దృశ్యం ఉంది. ‘హాయ్ ప్రభాస్ రేపటి రోజుకోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా?’ అని ఓం రౌత్ ప్రశ్నిస్తే.. ‘చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా.. ఫింగర్స్ క్రాస్డ్’ అని ప్రభాస్ బదులిచ్చారు. ‘లెటజ్ డూ ఇట్’ అని ఓం రౌత్ ముక్తాయించడంతో ఆ వీడియో ముగిసింది.
ఫింగర్స్ క్రాస్డ్ అంటే.. చూపుడు వేలి మీద మధ్యవేలిని ఉంచే చిహ్నం. దీనిని శుభసంకేతంగా భావిస్తారు. అదృష్ట సంకేతంగా, ఆశావహ దృక్పథంగా భావిస్తారు. ఓం రౌత్ అడగ్గానే.. ఫింగర్స్ క్రాస్డ్ అంటూ ప్రభాస్ చెప్పడం గమనిస్తోంటే.. వీరిద్దరి కాంబినేషన్లో భారీ చిత్రానికి సంబంధించిన ప్రకటన వస్తుందనే ఆలోచన అభిమానులకు కలుగుతోంది.
ఓం రౌత్ అంటే బాలీవుడ్ దర్శకుడు, రచయిత, నిర్మాత కూడా! ఈ ఏడాదిలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమైన తన్హాజీ దర్శకుడు. అంతగా వెలుగులోకి రాని మరాఠా యోధుడి జీవిత కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ దేవగన్, సైఫ్ ఆలీఖాన్, కాజల్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 367 కోట్లరూపాయలకు పైగా వసూలు చేసింది. ఓం రౌత్ కు భారీ బ్రాండ్ ఇమేజి ఏర్పడింది.
అలాంటి ఓం రౌత్ తో వీడియో సంభాషణ ఈ ట్వీట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ‘సిద్ధంగా ఉన్నావా’ అని ఓం రౌత్ అడగడమూ, ‘చాలా ఉత్సుకతతో’ ఎదురుచూస్తున్నా అని ప్రభాస్ చెప్పడమూ ఇదంతా గమనిస్తే వారిద్దరి కాంబినేషన్లో భారీ చిత్రానికి సంబంధించిన ప్రకటన తప్పదని ఎవరైనా అనుకుంటారు. ప్రభాస్- బాహుబలి నేపథ్యం, ఓం రౌత్- తన్హాజీ నేపథ్యంలు గమనించినప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో బాహుబలిని మించిన చిత్రం రూపొందించడానికి రేపు లాంఛనమైన ప్రకటన ఉంటుందనే డార్లింగ్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.











